Megastar’s Daughter Srija Gets Emotional: నేనేం పాపం చేశా నాకే ఎందుకిలా.? మెగాస్టార్ కూతురు శ్రీజ ఎమోషనల్
మెగాస్టార్ కూతురు శ్రీజ ఎమోషనల్

Megastar’s Daughter Srija Gets Emotional: మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెల్లెలు శ్రీజ కొణిదెల.. తొలిసారిగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అనుభవించిన మానసిక వేదనపై ఓపెన్ అయ్యారు. సాధారణంగా మెగా ఫ్యామిలీ విషయాలన్నా, ముఖ్యంగా శ్రీజ పర్సనల్ లైఫ్ అన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఐతే, గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు దూరంగా, సైలెంట్‌గా ఉంటూ వచ్చిన శ్రీజ.. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన జీవితంలోని చీకటి రోజులు, ఆ వేదన నుంచి తాను ఎలా బయటపడిందో చెప్తూ ఆమె షేర్ చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
శ్రీజ తన గతాన్ని తలచుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. "ఒకప్పుడు నా లైఫ్‌లో జరిగిన తప్పులే నా గుర్తింపు అనుకున్నాను. అసలు నాకే ఎందుకిలా జరుగుతోంది? నేనేం పాపం చేశానని ఒకదాని వెంట ఒకటి ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అని తీవ్ర మానసిక క్షోభ అనుభవించాను. ఎప్పుడూ నన్ను నేను ఒక బాధితురాలిగా (Victim) చూసుకుంటూ బాధపడేదాన్ని" అంటూ తన మనసులోని అసలు వేదనను బయటపెట్టారు.
అయితే, ఆ డిప్రెషన్ , మానసిక బాధ నుంచి తాను ఎలా కోలుకుందో కూడా శ్రీజ వివరించారు. 'శ్రీ పీఠం' (Sacred Paths) వ్యవస్థాపకురాలు అనురాధా రమేష్ మార్గదర్శకత్వంలో తాను చేసిన 15 నెలల 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు. ఆ కోర్సు ద్వారా.. తన జీవితాన్ని తనే తిరిగి నిర్మించుకోగలననే నమ్మకం, ధైర్యం తనకు వచ్చాయని శ్రీజ క్లారిటీ ఇచ్చారు.
కష్టాలను ఎదిరించి నిలబడ్డ శ్రీజ ఎమోషనల్ పోస్ట్‌పై మెగా ఫ్యామిలీ మెంబర్స్ సైతం స్పందిస్తున్నారు. శ్రీజ సోదరి, నటి నిహారిక కొణిదెల ఈ క్రేజీ పోస్ట్‌కు రియాక్ట్ అవుతూ.. 'మై సూపర్ ఉమెన్' అంటూ కామెంట్ చేసి తన అక్కకు మద్దతుగా నిలిచింది. గతాన్ని మర్చిపోయి, సరికొత్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న శ్రీజను చూసి మెగా అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

