సైలెన్స్?

Nagarjuna: అక్కినేని నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాగా వస్తున్న ‘కింగ్ 100’పై ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు. షూటింగ్ పూర్తయినప్పటికీ, సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్నా చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ ఓ టీజర్‌ను విడుదల చేశారు. జూదం, మోసాల చుట్టూ కథ తిరుగుతుందనే సంకేతాలను టీజర్‌లో చూపించారు. తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తుండగా, టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సుష్మితా భట్ కథానాయికల్లో ఒకరిగా నటిస్తున్నారు.
డిసెంబర్ 24న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే విడుదలకు రెండు నెలల సమయం కూడా లేకపోయినా, ఇప్పటివరకు పాటలు విడుదల చేయలేదు. ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభం కాలేదు. దీంతో సినిమాపై పెద్దగా చర్చ జరగడం లేదు.
ప్రస్తుతం నాగార్జున ‘బిగ్‌బాస్ తెలుగు 10’ షోతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, ఆయన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన 100వ సినిమా కావడంతో ప్రమోషన్స్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు రా కార్తిక్ పెద్దగా పరిచయం లేకపోవడంతో, ఈ సినిమాకు నాగార్జునే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలు, పాటలు, ప్రచార కార్యక్రమాల ద్వారా సినిమాపై ఆసక్తి పెంచాల్సి ఉంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ఇకనైనా ప్రచార వేగాన్ని పెంచుతుందా? నాగార్జున 100వ సినిమాకు తగిన హైప్ తీసుకొస్తుందా? అన్నది చూడాలి.

