Yeh Prem Mol Liya.. కుటుంబ విలువలతో సూరజ్ బర్జాత్యా కొత్త మ్యాజిక్!
ఆయుష్మాన్ ఖురానా ప్రేమ్ పాత్రలో కొత్త అవతారం.. 42 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అనుపమ్ ఖేర్!

భారతీయ సినీ ప్రేక్షకులకు కుటుంబ విలువలు, అనుబంధాల విలువను తన చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు గుర్తుచేసే దిగ్గజ దర్శకుడు సూరజ్ బర్జాత్యా మరోసారి తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన దర్శకత్వంలో, ఆయుష్మాన్ ఖురానా హీరోగా ప్రతిష్టాత్మక 'రాజశ్రీ ప్రొడక్షన్స్' నిర్మిస్తున్న 61వ చిత్రం 'యే ప్రేమ్ మోల్ లియా'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఎంతో సందడిగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సూరజ్ బర్జాత్యా, హీరో ఆయుష్మాన్ ఖురానా, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సినిమా విశేషాలతో పాటు రాజశ్రీ సంస్థతో తమకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు.
'ప్రతి సినిమాకు ఒక జాతకం ఉంటుంది' సూరజ్ బర్జాత్యా
40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా, ఇప్పటికీ తమ సినిమాలకు, సంగీతానికి ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో కృతజ్ఞతగా ఉందని సూరజ్ బర్జాత్యా అన్నారు. రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మాతలే తనకు వెన్నెముక అని పేర్కొంటూ, యువ దర్శకులకు ఆయన కీలక సూచనలు చేశారు.
"రాజశ్రీ నిర్మాతలు ఎప్పుడూ సినిమా హంగులను కాకుండా కథనే నమ్మారు. నేటి యువ దర్శకులకు నేను చెప్పేది ఒక్కటే.. సినిమా తీయండి కానీ మొదటి, రెండు, మూడు రోజుల కలెక్షన్ల గురించి అతిగా ఆందోళన చెందకండి. ప్రతి సినిమాకు దానికంటూ ఒక జాతకం (కుండలి) ఉంటుంది. కొన్ని వేగంగా దూసుకెళ్తాయి, మరికొన్ని నెమ్మదిగా ప్రయాణిస్తాయి. కానీ ప్రతి సినిమాకు ఒక ప్రయాణం ఉంటుంది. ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బుతో థియేటర్‌కు వస్తారు కాబట్టి వారిని అలరించే సినిమా తీయాలి. ఒక సినిమా ఆడకపోతే మరో సినిమా ఆడుతుంది. అంతిమంగా గెలిచేది కథే తప్ప దర్శకుడు కాదు" అని సూరజ్ బర్జాత్యా వివరించారు.
'యే ప్రేమ్ మోల్ లియా' టైటిల్ వెనుక ఉన్న ఆంతర్యం ఇదే!
సినిమా టైటిల్ గురించి సూరజ్ మాట్లాడుతూ.. "మన సంప్రదాయాలు, శాస్త్రాల గురించి చదువుతున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. వివాహ సమయంలో వరుడు తోరణాన్ని తాకి, ఆ కుటుంబానికి సంబంధించిన బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసే ఒక ఆచారం ఉంది. నా భార్య నాకు ఈ ఆచారం గురించి చెప్పినప్పుడు, దాని వెనుక ఉన్న లోతైన అర్థం నాకు బోధపడింది. నేటి కాలంలో మనం కొన్ని విలువలను, బాంధవ్యాలను చాలా తేలికగా తీసుకుంటున్నాం.
కుటుంబంలోని అమ్మమ్మ, అమ్మ, అత్త.. ఇలా ప్రతి మహిళ యొక్క ప్రాధాన్యతలను, భావాలను గౌరవించాలని ఈ సినిమా చెబుతుంది. ఇందులో ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే కేవలం కలిసి ఉండాలనుకోవడం కాకుండా, ఆ ప్రేమకు తాము అర్హులమని నిరూపించుకోవడానికి, రెండు కుటుంబాలను ఏకం చేయడానికి వారు ఎలాంటి మూల్యం చెల్లించడానికి సిద్ధపడ్డారనేదే ఈ కథ. రెండు కుటుంబాలు కలవడమంటే అసలు అర్థం ఏమిటో ఈ చిత్రంలో చూపించబోతున్నాం" అని తెలిపారు.
'నేను ఇప్పటివరకు ఇంత పర్ఫెక్ట్ పాత్ర చేయలేదు' ఆయుష్మాన్ ఖురానా
రాజశ్రీ సినిమాల్లో హీరో అనగానే 'ప్రేమ్' అనే పేరు, సంస్కారం గుర్తుకొస్తాయి. ఆ పాత్రలో నటించడంపై ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎక్కువగా లోపాలున్న సాధారణ యువకుడి పాత్రలే పోషించాను. కానీ 'ప్రేమ్' పాత్ర అలా కాదు, అతను ఒక పర్ఫెక్ట్ మ్యాన్.. సర్వగుణ సంపన్నుడు. సమాజంలో ఎలాంటి వ్యక్తి ఉండాలని మనం కోరుకుంటామో అలాంటి ఆదర్శవంతమైన పాత్ర ఇది. సినిమాల్లో రెండు రకాలు ఉంటాయి.. సమాజం ఎలా ఉందో చూపించేవి ఒకటైతే, సమాజం ఎలా ఉండాలో చూపించేవి రెండో రకం. రాజశ్రీ సంస్థ ఎప్పుడూ సమాజం ఎలా ఉండాలో చూపించే సినిమాలే చేస్తుంది. ఒక కొడుకుగా, భర్తగా, మనిషిగా ఎలా ఉండాలో 'ప్రేమ్' పాత్ర చూపిస్తుంది. విలువలు, బాధ్యత, మహిళల పట్ల గౌరవం ఉన్న ఇలాంటి పాత్రను నా కెరీర్లో ఇంతవరకు చేయలేదు" అని ఆయుష్మాన్ ఆనందం వ్యక్తం చేశారు.
'సూరజ్‌కు నేనే లక్కీ ఛార్మ్.. 42 ఏళ్ల క్రితం నేనే ఆర్డర్ వేశా' అనుపమ్ ఖేర్
సూరజ్ బర్జాత్యాతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. "సూరజ్ సినిమాలకు నేనే లక్కీ ఛార్మ్. ఈ రోజుల్లో మన చుట్టూ నెగెటివిటీ ఎక్కువైపోయింది. ఎవరైనా నిజాయితీగా, మంచిగా ఉంటే 'అరే ఇది రాజశ్రీ టైప్ సినిమా' అని అంటున్నారు. కానీ దశాబ్దాలుగా ఇలాంటి స్వచ్ఛమైన సినిమాలు తీయాలంటే ఎంతో ధైర్యం, సంస్కారం ఉండాలి. సూరజ్ పక్కన ఉంటే నాకు ఎంతో స్వచ్ఛంగా అనిపిస్తుంది" అని అన్నారు.
42 ఏళ్ల నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ.. "నా మొదటి సినిమా 'సారాంశ్' షూటింగ్ సమయంలో సూరజ్ ఐదవ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. నిర్మాత కొడుకు కావడంతో ఎవరూ అతనికి పని చెప్పేవారు కాదు. కానీ సూరజ్‌కు పని చేయాలనే తపన ఎక్కువగా ఉండేది. అప్పుడు నేను అతన్ని పిలిచి 'ఇటు రా.. నీ పేరేంటి? సూరజ్, నా డైలాగ్స్ ఫైల్ తీసుకురా' అని చెప్పాను. బహుశా నా జీవితంలో నేను అతనికి ఆర్డర్ వేసిన ఏకైక సందర్భం అదే. ఆ తర్వాత గడిచిన 42 ఏళ్లుగా నేను ఆయన ఆర్డర్లనే పాటిస్తున్నాను" అంటూ అనుపమ్ ఖేర్ చమత్కరించారు. అలాగే ఇటీవల తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన హనుమాన్, జటాయువు పోస్టుల గురించి మాట్లాడుతూ, మంచితనానికి ప్రతీకగా నిలిచే ఆ ప్రాజెక్ట్ వివరాలను మరో రెండు రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు.
మొత్తానికి కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రాజశ్రీ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న 'యే ప్రేమ్ మోల్ లియా' మరోసారి బాక్సాఫీస్ వద్ద మధురమైన అనుభూతిని పంచడం ఖాయమని ట్రైలర్ లాంచ్ వేడుకతో స్పష్టమైంది.

