Rathnavelu: పెద్దిలో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తరు:రత్నవేలు
బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తరు:రత్నవేలు

Rathnavelu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పంచుకున్న విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ చూపించబోయే వేరియేషన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. తొలుత క్రికెటర్‌గా, ఆ తర్వాత మల్లయోధుడిగా చరణ్ మేకోవర్ అద్భుతంగా ఉంటుందని రత్నవేలు తెలిపారు. ఈ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చరణ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. క్రికెట్, కుస్తీ.. ఈ రెండు క్రీడల నేపథ్యానికి తగ్గట్టు శరీరాకృతిని మార్చుకునేందుకు ఆయనకు చాలా తక్కువ సమయం దొరికింది.
అయితే, ఆ తక్కువ సమయంలోనే చరణ్ కఠినంగా శ్రమించారని.. అప్పుడు ఆయన అయ్యప్ప దీక్షలో ఉన్నప్పటికీ, కేవలం వెజిటేరియన్ డైట్‌ను ఫాలో అవుతూనే అనుకున్న శరీరాకృతిని సాధించారని రత్నవేలు ప్రశంసించారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్, ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాల్లో చరణ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, అవి చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎమోషనల్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా, 'పెద్ది'లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. కథ వాస్తవికతకు దగ్గరగా ఉన్నప్పటికీ, ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని రత్నవేలు స్పష్టం చేశారు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి చెబుతూ.. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఏ కథానాయికకు లేనంత కొత్తగా ఆమె ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందని హింట్ ఇచ్చారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

