Akhil's Lenin: అఖిల్ ‘లెనిన్’ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సపోర్ట్!
ఎన్టీఆర్ సపోర్ట్!

Akhil's Lenin: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ మరియు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య పరిశ్రమలో మంచి స్నేహబంధం ఉందనే విషయం తెలిసిందే. అలాగే నందమూరి కుటుంబానికి, అక్కినేని నాగార్జునకు మధ్య కూడా ఎంతో కాలంగా మంచి అనుబంధం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ ఆత్మీయత అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘లెనిన్’ ప్రమోషన్స్ కోసం ఉపయోగపడుతోంది. ఈ క్రమంలోనే అఖిల్ నయా చిత్రానికి మద్దతుగా నిలిచేందుకు ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, అఖిల్‌తో కలిసి ఒక ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇటీవలే రికార్డ్ అయిన ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో వీరిద్దరూ ‘లెనిన్’ సినిమా విశేషాలతో పాటు పలు ఆసక్తికరమైన వ్యక్తిగత, సినీ విషయాలను కూడా పంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భారీ క్రేజీ కాంబినేషన్ ఇంటర్వ్యూను రాబోయే కొద్ది రోజుల్లో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అధికారికంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అఖిల్ అక్కినేనికి ఈ ‘లెనిన్’ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా మారింది. 2023లో వచ్చిన ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తర్వాత, సుమారు మూడేళ్ల విరామం తీసుకొని అఖిల్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఈసారి ఎలాగైనా సరే ప్రేక్షకులకు ఒక పవర్‌ఫుల్ హిట్ ఇవ్వాలనే కసితో కింగ్ నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావడం కోసం దాదాపు మూడు సార్లు రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తూ, పలు రీషూట్లు కూడా జరిపి తుది రూపాన్ని పక్కాగా సిద్ధం చేశారు.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో సాగనుంది. ఇందులో అఖిల్ పూర్తి స్థాయి చిత్తూరు యాసలో డైలాగులు చెబుతూ సరికొత్తగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, భారీ అంచనాల మధ్య జూలై 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ప్రమోషన్స్‌కు తోడవడంతో అక్కినేని అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

