Srivari Brahmotsavams: బ్రహ్మోత్సవాల్లో వైద్య సేవల ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష
అదనపు ఈవో సమీక్ష

Srivari Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23వ తేది వరకు తిరుమలలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వైద్య సేవలు, రవాణా విభాగాలు, పోలీసుల భద్రతపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి భక్తులకు అందుబాటులో ఉంచనున్న వైద్య సదుపాయాలను అదనపు ఈవోకు వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు తిరుమలలో అశ్వినీ ఆసుపత్రి, అపోలో కార్డియాక్ సెంటర్లు 24 గంటలు నిరంతరాయంగా పని చేస్తాయని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2, గాలి గోపురం, ఏటీసీ, కల్యాణకట్ఠ, పీఏసీ-5 ప్రాంతాల్లో 6 డిస్పెన్సరీలు, పీఏసీ-2, భాష్యకార్ల సన్నిధి, అలిపిరి రాజగోపురం, 1500 మెట్టు, ఏడో మైలు, శ్రీవారి మెట్టు 1200 మెట్టు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, శ్రీవారి ఆలయం, నారాయణగిరి షెడ్లు, దర్శన క్యూలైన్లలో ఒక మొబైల్ క్లీనిక్ (కృష్ణతేజ సర్కిల్ నుండి గోగర్భం సర్కిల్ వరకు) 10 ప్రథమ చికిత్సా కేంద్రాలతో పాటు రామ్ భగీచా,శిలాతోరణం, పాపవినాశనం, శ్రీవారి సేవా సదన్, శ్రీవారి మెట్టు, అలిపిరి పాదాల మండపం వద్ద నూతనంగా 6 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 11 మంది డాక్టర్లు, 139 మంది పారా మెడికల్ సిబ్బందికి అదనంగా 75 మంది డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం తిరుమలలో మొత్తం 16 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
అనంతరం అదనపు ఈవో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మందులను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
మాడ వీధుల్లో భక్తులకు సమస్యలు తలెత్తితే పోలీసుల సమన్వయంతో సురక్షితంగా త్వరితగితిన ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మాడ వీధుల్లో అంబులెన్సు లకు క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తిరుమల డీఎస్పీ శ్రీ విజయ శేఖర్ ను కోరారు.
అంబులెన్స్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో క్రమశిక్షణతో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రవాణా విభాగం జీఎం శ్రీ రాము ను ఆదేశించారు.
ఈ సమావేశంలో వీజీఓ శ్రీ సురేంద్ర, అశ్వినీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

