Sri Prasanna Venkateswara Swamy: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మేదినిపూజ నిర్వహించి, అనంతరం సేనాధిపతి ఉత్సవాన్ని చేపట్టారు. సంప్రదాయం ప్రకారం శ్రీ విష్వక్సేనులవారు నాలుగు మాడవీధుల్లో విహరించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అనంతరం యాగశాలలో అంకురార్పణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు మంగళారంభం పలికారు. జూన్ 25 గురువారం ఉదయం 8.30 గంటల నుండి 9.00 గంటల మధ్య కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు వివిధ దివ్య వాహనాలపై విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story