Rules While Lighting a Lamp at Home: హిందూ సంప్రదాయంలో దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దీపం కేవలం చీకటిని పోగొట్టడమే కాదు.. ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొట్టి, లక్ష్మీదేవి అనుగ్రహం లభించేలా చేస్తుంది. అయితే మనకు తెలియకుండా దీపం వెలిగించేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల పూజా ఫలితం దక్కకపోగా, నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆధ్యాత్మిక, వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో అసలు దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి? ఏ దిక్కున పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దీపారాధనకు సరైన సమయం ఏది?

శాస్త్రాల ప్రకారం, ఇంట్లో దీపాన్ని రోజుకు రెండుసార్లు వెలిగించడం అత్యంత శుభప్రదం.

ఉదయం సమయం:

తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేదా ఉదయం 5 గంటల నుండి 7 గంటల లోపు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో రోజంతా సానుకూల శక్తి ఉంటుంది.

సాయంత్రం సమయం:

సూర్యాస్తమయం సమయం అంటే సాయంత్రం 5:30 నుండి 7 గంటల మధ్య ఇంట్లో, తులసి కోట ముందు దీపం వెలిగించాలి. దీనివల్ల అలక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయి, లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్ముతారు.

ఏ దిక్కున దీపం పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది?

దీపం వెలిగించేటప్పుడు దాని ఒత్తి ఏ దిక్కుకు ఉందనేది చాలా ముఖ్యం.

తూర్పు దిక్కు:

దీపపు జ్యోతి తూర్పు వైపునకు ఉంటే ఆయుష్షు పెరుగుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది మరియు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

ఉత్తర దిక్కు:

దీపాన్ని ఉత్తర ముఖంగా వెలిగిస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. సంపద, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాల కోసం ఉత్తర దిక్కున దీపం పెట్టడం విశేష ఫలితాన్ని ఇస్తుంది.

పడమర దిక్కు:

పడమర దిక్కున దీపం పెట్టడం వల్ల శని దోషాలు, అప్పుల బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే, కొన్ని ప్రత్యేక పూజల సమయంలో తప్ప సాధారణంగా నిత్య పూజలో దీనిని అంతగా సిఫార్సు చేయరు.

దక్షిణ దిక్కు:

దక్షిణ దిక్కు యమ స్థానం కాబట్టి, సాధారణ రోజుల్లో పూజ గదిలో దక్షిణ ముఖంగా దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది ఇంట్లో నష్టాలను, అశాంతిని తెచ్చిపెడుతుంది.

దీపారాధనలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు..

నేలపై నేరుగా పెట్టొద్దు:

దీపపు ప్రమిదను ఎప్పుడూ నేరుగా నేలపై పెట్టకూడదు. ప్రమిద కింద చిన్న ప్లేట్ గానీ, కనీసం కొన్ని అక్షతలు లేదా తమలపాకునైనా ఆసనంగా ఉంచాలి.

ఒత్తుల సంఖ్య:

నిత్య దీపారాధనలో కనీసం రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించడం మంచిది. ఏక ఒత్తితో దీపం వెలిగించడం శుభప్రదం కాదు.

నూనె, నెయ్యి నియమం:

దీపంలో ఎప్పుడూ నాణ్యమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె మాత్రమే వాడాలి. పూజ గదిలో నూనె దీపం వెలిగిస్తే అది దేవుడికి కుడి వైపున, నెయ్యి దీపం వెలిగిస్తే అది దేవుడికి ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలి.

చీకటి ఉండకూడదు:

పూజ గదిలో ఎప్పుడూ పూర్తిగా చీకటి ఉండకూడదు. నూనె దీపంతో పాటు వెలుతురు కోసం ఒక చిన్న జీరో బల్బును రాత్రి వేళల్లో వెలిగించి ఉంచడం వల్ల సానుకూల శక్తి స్థిరంగా ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story