Ashtabandhan: కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 26వ తేదీ వరకు అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్ తెలిపారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

మహా సంప్రోక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను జేఈవో ఆదేశించారు. ఇంజినీరింగ్, విద్యుత్ పనులను త్వరగా పూర్తి చేయడంతోపాటు విద్యుత్ దీపాలు, పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించాలన్నారు. ధ్వజస్తంభం, బలిపీఠానికి సంబంధించిన ఇత్తడి రేకు పనులను ఆగస్టు 21లోగా పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

ఆలయానికి చేరుకున్న జేఈవోకు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

ఒంటిమిట్ట ఆలయంలోనూ ఏర్పాట్ల పరిశీలన

అనంతరం జేఈవో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, పోటు, యాగశాల, ప్రసాదాల పంపిణీ తదితర భక్తుల సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం టీటీడీ నిర్మించనున్న 100 గదుల వసతి సముదాయం కోసం కేటాయించనున్న స్థలాన్ని, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, శ్రీమతి సుమతి, డిప్యూటీ ఈఈ శ్రీ నాగరాజు, ఆలయ ఏఈవో శ్రీ ఎన్. రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఈశ్వర్ రెడ్డి, శ్రీ మోహన్ బాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story