Astrology Experts Warn: జ్యోతిష్య నిపుణుల హెచ్చరిక: ఈ చిన్న పొరపాట్లు చేస్తే గ్రహ పాట్లు తప్పవు.. కష్టాలు కొని తెచ్చుకున్నట్టే!
కష్టాలు కొని తెచ్చుకున్నట్టే!

Astrology Experts Warn: ప్రతిరోజూ బిజీగా ఉండే ఆధునిక జీవితంలో చాలామంది సాంప్రదాయ నియమాలను విస్మరిస్తున్నారు. జాతకంలో ఎలాంటి దోషం లేకపోయినా కష్టాలు వెంటాడుతున్నాయంటే, తెలిసి తెలియక చేసే చిన్న పొరపాట్లే కారణమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం పెద్దలు ఆచరించిన నియమాలను పాటించకపోతే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నియమాలు పాటించడం వ్యక్తిగత విషయమే అయినా, వాటిని వదిలేస్తే గ్రహ పాట్లు, దారిద్ర్యం, ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు స్పష్టం చేశారు.
సూర్యుడు ఉదయించే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఉదయం తర్వాత వాకిలి చిమ్ముకోవడం సూర్యభగవానుడికి నీళ్లు చల్లినట్లవుతుందని పండితులు అంటున్నారు. నిద్ర లేవగానే దుప్పటిని మడిచి బెడ్ షీట్‌ను శుభ్రంగా సర్దాలి. లేకుంటే దరిద్రదేవత అక్కడ ఆసనం వేసుకుంటుందని నమ్మకం. అన్నం తిన్న తర్వాత ఎంగిలి కంచం ముందు చేతులు ఎండబెట్టుకోకూడదు. తిన్న ప్రదేశం నుంచి జరిగి చేతులు కడుక్కోవాలి. ప్లేట్లోనే చేతులు కడుక్కోవడం నిషిద్ధం. తిన్న తర్వాత కాళ్లు తప్పనిసరిగా కడుక్కోవాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మాసిన బట్టలు ఉతికిన నీళ్లను కాళ్లపై పోసుకోకూడదు. వాటిని బాత్రూంలో పారబోసి వేరే నీళ్లతో స్నానం చేయాలి. లేకుంటే జ్యేష్ఠదేవి ఇంట్లో ప్రవేశించి గొడవలు మొదలవుతాయని పండితులు చెబుతున్నారు. ఇళ్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసి బట్టలను సూర్యాస్తమయం తర్వాత ఉతకకూడదు. సంధ్యా కాలంలో నిద్రపోవడం, ఆహారం తినడం, గొడవలు పడటం నిషేధం. ఆ సమయం ప్రదోష కాలం కాబట్టి ధ్యానం, పూజ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
పూజగదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు. లోహ విగ్రహాలు ఎత్తు తక్కువగా ఉండాలి. దేవాలయాల నుంచి విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం-సాయంత్రం మంచినీరు ఉంచాలి. తగ్గిన నీటిని స్నానం తర్వాత తలపై చల్లుకోవచ్చు. దీపారాధనకు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వాడాలి. కల్తీ నూనె వాడకూడదు. పూజ సమయంలో ఆసనంపైనే కూర్చోవాలి. సాయంత్రం ఆరు గంటల తర్వాత సూది, ఉప్పు, నూనె, గుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. శనివారం చెప్పులు, గొడుగు, మాంసం తెచ్చుకోవడం నిషిద్ధం.
కుజదోషం ఉన్నవారు మంగళవారం గుడ్లు తినకూడదు. శనివారం నలుపు వస్త్రాలు, ఇనుము వస్తువులు తీసుకోకూడదు. ఇంట్లో శుభ్రత తప్పనిసరి. పూజగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. వంట సమయంలో అరుస్తూ మాట్లాడకూడదు. తులసి ఆకులను గోటితో గిల్లకూడదు. రోజూ దీపారాధన చేయాలి. ఈ నియమాలను పాటిస్తే గ్రహ పాట్లు తగ్గి, శాంతి, సంపద కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక జీవితంలో సాంప్రదాయాలను పూర్తిగా విస్మరించకుండా కొన్ని ప్రాథమిక నియమాలనైనా పాటించడం మంచిదని వారు సూచిస్తున్నారు.

