Srivari Darshans: ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు మరియు వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది. షెడ్యూల్ ప్రకారం, మే 18వ తేదీ ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి లక్కీ డిప్ ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. భక్తులు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు ఆగస్టు 23 నుండి 25 వరకు జరిగే సాలకట్ల వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను విడుదల చేస్తారు. మే 23వ తేదీన మరికొన్ని కీలక కోటాలను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు విడుదలవుతాయి. అనంతరం వయోవృద్ధులు, దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తుల కోసం కేటాయించే ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ఆఖరుగా మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు అత్యంత ప్రజాదరణ పొందే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలలోని వసతి గదుల కోటాను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ఈ సేవలన్నింటినీ టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story