Balalayam: రేపటినుంచి వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో బాలాలయం
బాలాలయం

Balalayam: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ సీతా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఆలయాల్లో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు బాలాలయం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా అక్టోబర్ 29వ తేదీ గురువారం సాయంత్రం అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 30న చతుస్స్థానార్చన, కళాకర్షణ, ఏకాంతసేవ నిర్వహిస్తారు. అక్టోబర్ 31న చతుస్స్థానార్చన, ప్రాయశ్చిత్త హోమం, కుంభవాహనం, మహాకుంభాభిషేకం, ద్వారదారు విగ్రహ కళావాహనం, షోడశోపచార పూజ, లఘు పూర్ణాహుతి నిర్వహిస్తారు.
నవంబర్ 1వ తేదీ ఆదివారం సప్తమి తిథి, పునర్వసు నక్షత్రం, ధనుర్లగ్న పుష్కరాంశంలో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.
గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

