Bhadrakali Ammavaru: వరంగల్ నగరంలో చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరి నవరాత్రి మహోత్సవాలు ఈరోజు నుండి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఉత్సవాల తొలిరోజున అమ్మవారికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.

ఆషాఢ మాసంలో జరిగే ఈ శాకంభరి ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. సుమారు 450 నుంచి 500 ఏళ్ల క్రితం దేశంలో తీవ్రమైన కరవు వచ్చి, వర్షాలు లేక పంట పొలాలు బీడు భూములుగా మారాయట. ఆ సమయంలో లోక కల్యాణం కోసం, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని భద్రకాళి ఆలయంలో ఈ శాకాంబరీ ఉత్సవాలను ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.

మొత్తం 15 రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల చివరి రోజున ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని పూర్తిగా రకరకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక మొదటి రోజైన ఈరోజు ఉదయం 'కాళీ క్రమం'లో, సాయంత్రం 'కామేశ్వరీ క్రమం'లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ అధికారులు, కమిటీ అన్ని రకాల భారీ ఏర్పాట్లు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story