Bheeshma Ekadashi: రేపు భీష్మ ఏకాదశి..చేయాల్సిన పనులు ఇవే..
చేయాల్సిన పనులు ఇవే..

Bheeshma Ekadashi: భీష్మ ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా విశిష్టమైన రోజు. మాఘ మాస శుక్ల పక్ష ఏకాదశిని ' ఈ ఏడాది భీష్మ ఏకాదశిగా(జనవరి29) జరుపుకుంటాం. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు , విశిష్టత ఏంటంటే.?
1. భీష్ముడి నిర్యాణం (ముక్తి పొందిన రోజు):
మహాభారత యుద్ధంలో అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్మ పితామహుడు అంపశయ్యపై శయనిస్తాడు. ఆయనకు 'స్వచ్ఛంద మరణం' అనే వరం ఉన్నందున, సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే వరకు వేచి చూసి, ఈ మాఘ శుక్ల ఏకాదశి రోజే తన ప్రాణాలను విడిచి పరమాత్మలో లీనమయ్యారు. అందుకే దీనిని భీష్మ ఏకాదశి అంటారు.
2. విష్ణు సహస్రనామ ఆవిర్భావం:
ఈ రోజుకు ఉన్న మరో అతిపెద్ద విశిష్టత విష్ణు సహస్రనామ స్తోత్రం. అంపశయ్యపై ఉన్న భీష్ముడి వద్దకు శ్రీకృష్ణుడు ధర్మరాజును తీసుకెళ్తాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు రాజ్య ధర్మాలను బోధిస్తూ, మోక్ష మార్గంగా శ్రీమహావిష్ణువు యొక్క వేయి నామాలను (విష్ణు సహస్రనామాలు) ఉపదేశిస్తాడు. ఈ అద్భుత ఘట్టం ఈ రోజే జరిగింది.
ఈ రోజు ఏం చేస్తారు?
ఉపవాసం: ఇతర ఏకాదశుల వలెనే ఈ రోజు కూడా భక్తులు ఉపవాసం ఉంటారు.
విష్ణు సహస్రనామ పారాయణం: ఈ రోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల వెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుందని నమ్మకం.
భీష్మ తర్పణం: భీష్ముడు నైష్ఠిక బ్రహ్మచారి కాబట్టి ఆయనకు సంతానం లేదు. అందుకే లోకంలోని వారందరూ ఆయనకు ఈ రోజు తర్పణాలు (నీటిని వదలడం) వదులుతారు. ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని చెప్తారు.

