Bhu Varahaswamy Temple: తిరుమల ముందుగా ఈ దేవుడిని దర్శించుకోండి..
ఈ దేవుడిని దర్శించుకోండి..

Bhu Varahaswamy Temple: తిరుమల కొండపైకి చేరుకోగానే చాలా మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కడుతుంటారు. నిజానికి తిరుమల ఆదివరాహ క్షేత్రాన్ని దర్శించుకోవాలంట. అందువల్ల తిరుమలకు వచ్చే భక్తులు తొలుత పుష్కరిణి పక్కనే ఉన్న వరాహ క్షేత్రాన్ని దర్శించుకోవాలనే ఆచారం ఉంది. ఈ విషయాన్ని టీటీడీ అప్డేట్స్ తన ఎక్స్ వేదికగా పేర్కొంటూ భక్తులకు అవగాహన కల్పిస్తోంది. వెంకటేశ్వర స్వామి వాగ్దానం ప్రకారం వరాహ స్వామికి మొదటి పూజ, నైవేద్యం సమర్పిస్తారని ప్రతీతి.
శ్రీ వరాహస్వామి ఆలయం లేదా భూ వరాహస్వామి ఆలయం. తిరుపతి జిల్లా తిరుమలలో ఉన్న వైష్ణవాలయం. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే పురాతనమైనదని భావిస్తారు. అందువల్లనే వేంకటాచలం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
వైకుంఠం నుంచి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసిచ్చినట్లు చెబుతారు. ఈ తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్శించకపోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.

