Big Canteens Coming Up in Tirumala for Devotees: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి బిగ్ క్యాంటీన్ల నిర్వాహకులను ఆదేశించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆయన బిగ్ క్యాంటీన్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ పాలసీ ప్రకారం నిర్ణయించిన ధరలకే ఆహార పదార్థాలను భక్తులకు విక్రయించాలని ఆదేశించారు. హోటళ్లలో సాంప్రదాయ ఆహారం మాత్రమే విక్రయించాలని, హోటల్ సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని చెప్పారు. హోటళ్లలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.

అనంతరం జనతా క్యాంటీన్ల నిర్వాహకులతో అదనపు ఈవో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం భక్తులకు అందుబాటు ధరలో ఆహారాన్ని విక్రయించాలని చెప్పారు.

అనంతరం కాటేజీ డోనార్ స్కీమ్ ద్వారా తిరుమలలో విశ్రాంతి గృహాలు నిర్మిస్తున్న దాతలతో అదనపు ఈవో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి మే 15లోపు విశ్రాంతి గృహాలను టీటీడీకి అప్పగించాలని తెలిపారు. అదేవిధంగా తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న ప్రతి విశ్రాంతి గృహంలో జనరేటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story