Bugga Malleshwara swamy temple: చుక్కనీరు లేని అటవీ ప్రాంతంలో నిత్య జలాభిషేకం.. బుగ్గ మల్లేశ్వర క్షేత్రం ప్రత్యేకత
బుగ్గ మల్లేశ్వర క్షేత్రం ప్రత్యేకత

Bugga Malleshwara swamy temple: గుంటూరు జిల్లా మాచవరం మండల సరిహద్దుల్లోని మోర్జంపాడుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో, దట్టమైన నల్లమల అభయారణ్యం ప్రారంభమయ్యే ప్రాంతంలో ఒక అద్భుత శివాలయం వెలసి ఉంది. చుట్టూ రాళ్ల గుట్టలు, మూడు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా చుక్కనీరు కూడా లేని నిర్జన ప్రదేశంలో.. గర్భాలయంలో శివలింగం పక్కనే ఒక చిన్న నీటి బుగ్గ ఉండి, అందులోని నీటితోనే స్వామికి నిత్యం అభిషేకాలు జరుగుతుండటం ఈ క్షేత్రం ప్రత్యేకత.
భ్రమరాంబ సమేతంగా కొలువైన బుగ్గ మల్లేశ్వరుడు ఇక్కడ గంగాధరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఒక వైపు శివాలయం ఉంటే, మరో వైపు సీతారాములు కూడా కొలువై ఉండటంతో ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. గర్భగుడిలో స్వామి పక్కనే భద్రకాళి, వీరభద్రస్వామి కూడా ఉన్నారు. శివలింగం ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారో స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, దాదాపు 600 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడి ఉంటుందని చరిత్ర చెబుతోంది.
దాదాపు 400 సంవత్సరాల క్రితం అమరావతి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు బెల్లంకొండ పరగణా ప్రాంతంలో పర్యటిస్తూ అడవిలో ఈ ఆలయాన్ని, పక్కనే ఉన్న నీటి బుగ్గను చూసి ఆశ్చర్యపోయారట. వెంటనే స్వామికి ధూపదీప నైవేద్యాలకు ఏర్పాట్లు చేయించారు. కాలక్రమంలో కాశీ నుంచి తెచ్చిన నర్మదా లింగం, టేకు ధ్వజం, నందీశ్వరుడిని ప్రతిష్ఠించారు. జమీందారు ఆలయ అభివృద్ధికి అనేక మాన్యాలు దానం చేశారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ అనాదిగా వారంలో కేవలం సోమవారం మాత్రమే పూజలు జరుగుతున్నాయి.
బుగ్గలో ఎంత నీరు తోడినా మళ్లీ సమృద్ధిగా ఊరడం, సూర్యరశ్మి సోకకపోయినా నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండటం మరో విశేషం. గతంలో తెలంగాణ ప్రాంత ప్రజలు వ్యాపార నిమిత్తం మోర్జంపాడుకు వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు ఈ మార్గంలో విశ్రమించి, బూరల్లో బుగ్గ నీరు నింపుకుని స్వామికి అభిషేకం చేసి, మిగిలిన నీటిని ప్రయాణ అవసరాలకు తీసుకెళ్లేవారట.
ఆలయానికి ఎదురుగా వృద్ధ లింగేశ్వరుడి ఆలయం ఉంది. ఇది బుగ్గ మల్లేశ్వరుడి కంటే పురాతనమైనదని భావిస్తారు. దక్షిణం వైపు సీతారాముల ఆలయం, ఎదురుగా మండపంలో ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్నారు. ఆగ్నేయంలో నాగేంద్రస్వామి పుట్ట వద్ద పూజలు చేస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో రెండు పవిత్ర కోనేరులు ఉన్నాయి.
కార్తిక మాసం, శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం విశేషంగా జరుగుతాయి. గతంలో బ్రహ్మదూత రామానంద సరస్వతి స్వామి ఈ ఆలయాలను సందర్శించి ఋషి ప్రతిష్ఠితాలని, తపస్సుకు అనువైన ప్రదేశాలని సూచించారు. ఉత్తర వాహినిగా కృష్ణానది ప్రవహించడం మరో విశేషం.
భక్తిశ్రద్ధలతో ఈ క్షేత్రాన్ని సందర్శించి మొక్కుకుంటే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పిడుగురాళ్ల నుంచి మోర్జంపాడు మీదుగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి ప్రైవేటు వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ప్రశాంతతకు, తపోభూమికి మారుపేరుగా నిలిచిన బుగ్గ మల్లేశ్వరస్వామి క్షేత్రాన్ని సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతి పొందండి.
ఓం నమః శివాయ! జై శ్రీమన్నారాయణ!

