ఈ 5 తప్పులు చేస్తే పూజా ఫలం దక్కదు.. నియమాలు ఇవే..

Women Worship Lord Hanuman: శక్తికి, భక్తికి నిలువుటద్దం ఆంజనేయ స్వామి. అయితే, స్త్రీలు హనుమంతుడిని పూజించకూడదని సోషల్ మీడియాలోనో లేదా బయటో తరచుగా వినిపిస్తుంటుంది. కానీ, వాస్తవానికి ఏ వేదంలోనూ మహిళలు హనుమంతుడిని పూజించకూడదని లేదు. కాకపోతే, స్వామివారు నిత్య బ్రహ్మచారి కావడంతో మహిళలు ఆయనను ఆరాధించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మహిళలు చేయకూడని 5 ప్రధాన తప్పులు:

విగ్రహాన్ని తాకడం:

హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. అందుకే మహిళలు స్వామివారి విగ్రహాన్ని నేరుగా తాకకూడదని పెద్దలు చెబుతారు. విగ్రహానికి దూరంగా ఉండి పువ్వులు సమర్పించి, ధూపదీప నైవేద్యాలతో పూజించుకోవచ్చు.

సింధూరం ధరించడం:

స్వామివారికి సమర్పించిన సింధూరాన్ని పురుషులు తిలకంగా దిద్దుకుంటారు. కానీ, మహిళలు మాత్రం హనుమంతుడికి అర్పించిన కుంకుమను తమకు తాము పూసుకోకూడదు.

వస్త్ర సమర్పణ:

హనుమంతునికి వస్త్రాలు సమర్పించడం, సింధూరంలో మల్లె నూనె కలిపి పూయడం వంటివి కేవలం పురుషులు మాత్రమే చేయాలి. మహిళలు హనుమంతునికి వస్త్రాలు సమర్పించకూడదు.

నెలసరి సమయంలో పూజ:

ధార్మిక నియమాల ప్రకారం.. మహిళలు ఋతుస్రావ సమయంలో హనుమంతుడి పూజకు దూరంగా ఉండాలి. అయితే, ఆ సమయంలో కూడా స్వామివారిని మనసులో స్మరించుకోవడంలో లేదా మానసికంగా ధ్యానించడంలో ఎటువంటి తప్పు లేదు.

ఆహార నియమాలు:

హనుమంతుడిని పూజించే స్త్రీపురుషులు ఎవరైనా సరే.. మంగళవారాలు, శనివారాలలో మాంసాహారం, చేపలు తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఈ రోజుల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు లేని సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.

పూజా ఫలం దక్కాలంటే..

మహిళలు భక్తితో హనుమాన్ చాలీసా పఠించడం, సుందరకాండ చదవడం వల్ల అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. కేవలం పై నియమాలను పాటిస్తూ నిష్కల్మషమైన భక్తితో ఆ వాయుపుత్రుడిని వేడుకుంటే చాలు, కష్టాల నుండి విముక్తి లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story