Garuda Purana’s Key Rules: హిందూ సనాతన ధర్మంలో గరుడ పురాణానికి విశిష్ట స్థానం ఉంది. మనిషి జననం, మరణం, మరణానంతరం ఆత్మ ప్రయాణం, అంతిమ సంస్కారాలు వంటి అనేక అంశాలపై గరుడ పురాణంలో విపులంగా వివరించారు. ఈ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి బతికున్నప్పుడు వారు ఉపయోగించే కొన్ని వస్తువులతో వారి శరీరం, మనస్సు, ఆత్మకు బలమైన అనుబంధం లేదా శక్తి ఏర్పడుతుంది. ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆ వస్తువులపై ఆత్మకు ఉండే మమకారం లేదా ఆకర్షణ కొంతకాలం పాటు కొనసాగుతుందని విశ్వసిస్తారు. అందుకే మరణించిన వ్యక్తుల వస్తువులను కుటుంబ సభ్యులు నేరుగా ఉపయోగించడం మంచిది కాదని, అది అశుభాలకు దారితీస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మరి గరుడ పురాణం ప్రకారం ఆ వస్తువులను ఏం చేయాలి? ఎలా పారవేయాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

దుస్తులు, ఆభరణాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మరణించిన వ్యక్తి నిత్యం ధరించే దుస్తులలో వారి శరీర శక్తి, భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కుటుంబ సభ్యులు లేదా రక్త సంబంధీకులు ఆ దుస్తులను ధరించకూడదని శాస్త్రం చెబుతోంది. ఆ దుస్తులను భద్రపరుచుకోవడం కంటే పేదలకు, ఆశ్రితులకు లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయడం ఎంతో ఉత్తమం. దీనివల్ల మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరుతుంది.

ఇక బంగారం, వెండి ఆభరణాల విషయానికొస్తే.. వాటిని నేరుగా తీసి వెంటనే ధరించకూడదు. ఆభరణాలపై గంగాజలం లేదా గోమూత్రం చల్లి శుద్ధి చేసిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. లేదా పాత ఆభరణాలను కరిగించి కొత్త రూపంలో పోత పోయించి వాడటం శ్రేయస్కరం. అలా కాదనుకుంటే వాటిని ఇంట్లో జ్ఞాపకంగా, కుటుంబ వారసత్వ ఆస్తిగా పూజా గదిలో లేదా లాకర్‌లో భద్రపరుచుకోవచ్చు.

గడియారాలు, వ్యక్తిగత వస్తువుల వాడకం

మనిషి నిత్య జీవితంలో సమయాన్ని చూసుకునే చేతి వాచ్ వారి వ్యక్తిగత జీవిత గమనంతో, శక్తితో ముడిపడి ఉంటుంది. మరణించిన వ్యక్తి ఉపయోగించిన వాచీలు, కళ్లద్దాలు లేదా ఇతర వ్యక్తిగత వస్తువులను ఇతరులు వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాడైపోయిన లేదా ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు ప్రవేశించి, పనుల్లో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి వస్తువులను ఒక పవిత్రమైన ప్రదేశంలో జ్ఞాపకార్థం ఉంచడం లేదా అవసరమైన వారికి దానమివ్వడం మంచిది.

ఆత్మ శాంతి.. మోక్ష ప్రాప్తి

మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను సరైన పద్ధతిలో దానధర్మాలు చేయడం ద్వారా ఆత్మకు మాయా బంధాల నుంచి విముక్తి లభించి, మోక్ష మార్గం సులభతరమవుతుందని నమ్ముతారు. మరణించిన వారి జ్ఞాపకాలపై అతిగా మమకారం పెంచుకోకుండా, శాస్త్రోక్తంగా దానాలు చేయడం ద్వారా ఆ కుటుంబంలో సానుకూల వాతావరణం, సుఖశాంతులు వెల్లివిరుస్తాయని గరుడ పురాణం స్పష్టం చేస్తోంది.

Next Story