ఈ డీడీ ఫ్రీ డిష్ తో ఫ్రీగా ఛానెల్స్ చూడొచ్చు

DTH : ప్రైవేట్ డిటిహెచ్ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థ ప్రసార భారతి గట్టి పోటీ ఇస్తోంది. వారి ఉచిత డీటీహెచ్ సర్వీస్ అయిన డీడీ ఫ్రీ డిష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దీని ఆధిపత్యం పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం, డీడీ ఫ్రీ డిష్ భారతదేశంలోనే అతిపెద్ద డీటీహెచ్ సర్వీస్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్ల ఇళ్లలో ఈ డీడీ డిష్‌ను ఏర్పాటు చేసుకున్నారని అంచనా.

డీడీ ఫ్రీ డిష్ ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది?

ఉచిత సేవ: 2004లో ప్రారంభమైన డీడీ ఫ్రీ డిష్ దేశంలో ఉన్న ఏకైక ఉచిత డీటీహెచ్ సర్వీస్. సాధారణ డిటిహెచ్ సర్వీసులకు ప్రతి నెలా సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ డీడీ ఫ్రీ డిష్‌లో ఉచిత ఛానెళ్లను ఎలాంటి నెలవారీ ఫీజు లేకుండా చూడవచ్చు.

పెరుగుతున్న వినియోగదారులు: 2018లో కేవలం 1.8 కోట్ల ఇళ్లలో ఉన్న ఈ సర్వీస్, 2024 నాటికి 4.9 కోట్లకు పెరిగింది. కొన్ని అంచనాల ప్రకారం ఈ సంఖ్య 6 కోట్లకు చేరింది.

ట్రాక్ చేయడం కష్టం: డీడీ డిష్ సిగ్నల్స్ ఎన్‌క్రిప్ట్ చేయబడవు. దీనివల్ల వాస్తవంగా ఎంతమంది వినియోగదారులు ఉన్నారో కచ్చితమైన సమాచారం లభించదు. ప్రసార భారతికి కూడా దీనిపై ఖచ్చితమైన సమాచారం లేదు.

డీడీ ఫ్రీ డిష్ ఎలా పొందాలి?

డీడీ ఫ్రీ డిష్ పొందడానికి మీరు మార్కెట్‌లో ఒక సెటప్ బాక్స్, డిష్ యాంటెన్నా కొనుగోలు చేయాలి. దీనికి దాదాపు రూ.2,000 ఖర్చు అవుతుంది. ఒకసారి వీటిని ఏర్పాటు చేసుకుంటే వందలాది ఛానెళ్లను ఎలాంటి నెలవారీ ఫీజు లేకుండా ఉచితంగా చూడవచ్చు.

ప్రైవేట్ ఛానెల్స్‌కు లాభం

స్టార్ ప్లస్, కలర్స్, జీ టీవీ, సోనీ వంటి ప్రధాన ఛానెళ్లు డీడీ ఫ్రీ డిష్‌లో రావాలంటే రూ.15-20 కోట్ల క్యారేజ్ ఫీజు చెల్లించాలి. నాలుగు నుంచి ఐదు కోట్ల ఇళ్లకు తమ కార్యక్రమాలను అందించే పెద్ద మార్కెట్ లభిస్తుంది కాబట్టి, ఈ ఛానెళ్లకు ఆ ఫీజు పెద్ద మొత్తం కాదు. ఈ క్యారేజ్ ఫీజుల ద్వారా ప్రసార భారతి సంస్థకు ఏటా రూ.800 కోట్లు ఆదాయం వస్తుంది.

దక్షిణ భాషల వైపు దృష్టి

ప్రస్తుతానికి డీడీ ఫ్రీ డిష్‌లో ఎక్కువగా హిందీ ఛానెళ్లు ఉన్నాయి. అందుకే ఉత్తర భారతంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ప్రభుత్వం దక్షిణ భారతదేశ మార్కెట్‌ను కూడా చేరుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా, దక్షిణ భాషల ఛానెళ్ల కోసం ఇ-వేలంలో రిజర్వ్‌డ్ స్లాట్‌లను కేటాయించాలని ప్రణాళికలు వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story