Obtain Amrit: దేవతలు, రాక్షసులు సాధారణంగా శత్రువులుగానే పురాణ కథల్లో కనిపిస్తారు. కానీ అమృతం కోసం జరిగిన సముద్ర మథనంలో మాత్రం ఇద్దరూ కలిసి పనిచేశారని పురాణాలు చెబుతున్నాయి.దేవతలు తమ శక్తిని కోల్పోయినప్పుడు విష్ణువును ఆశ్రయించారని కథ. అప్పుడు క్షీరసాగరాన్ని మథనం చేసి అమృతాన్ని పొందాలని విష్ణువు సూచించాడని భాగవత పురాణం చెబుతుంది.

అయితే సముద్రాన్ని మథించడం దేవతలకు మాత్రమే సాధ్యం కాదు. అందుకే రాక్షసులను కూడా ఇందులో భాగస్వాములను చేశారు. మందర పర్వతాన్ని మథన దండంగా, వాసుకి అనే నాగరాజును తాడుగా ఉపయోగించారు. పర్వతం సముద్రంలో మునిగిపోకుండా విష్ణువు కూర్మ అవతారం తీసుకుని దానికి ఆధారంగా నిలిచాడని కథ చెబుతుంది.

అయితే అమృతం రావడానికి ముందు ఊహించని ప్రమాదం వచ్చింది. సముద్రం నుంచి హాలాహల విషం బయటకు వచ్చింది. అది మొత్తం సృష్టిని నాశనం చేసేంత ప్రమాదకరమైనదిగా చెప్పబడింది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి సృష్టిని కాపాడాడని పురాణ కథ. విషాన్ని గొంతులోనే ఆపుకోవడంతో ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చిందని చెబుతారు.

ఆ తర్వాత సముద్రం నుంచి అనేక అద్భుతమైన వస్తువులు, దేవతలు బయటకు వచ్చారు. లక్ష్మీదేవి, ధన్వంతరి, ఐరావతం వంటి వాటితో పాటు చివరికి అమృతం కూడా ప్రత్యక్షమైంది. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య మళ్లీ పోటీ మొదలైంది. విష్ణువు మోహినీ రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకు అందించాడని భాగవత పురాణంలోని కథనం చెబుతుంది.

ఈ కథలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమృతం కోసం శత్రువులైన దేవతలు, రాక్షసులు కూడా కలిసి పనిచేయాల్సి వచ్చింది. అంటే ఒక పెద్ద లక్ష్యం ముందు విభేదాలు పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ లక్ష్యం సాధించిన తర్వాత మళ్లీ పోటీ మొదలైంది.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సముద్ర మథనం కథ అన్ని పురాణాల్లో ఒకే విధంగా ఉండదు. ఏ వస్తువులు ముందుగా వచ్చాయి, ఎన్ని రత్నాలు వచ్చాయి అనే విషయాల్లో గ్రంథాల మధ్య తేడాలు కనిపిస్తాయి. భాగవతం, విష్ణు పురాణం, కూర్మ పురాణం వంటి గ్రంథాల్లో ఈ కథకు వేర్వేరు వివరాలు ఉన్నాయి.

Next Story