Pancha Narasimha Kshetras of Yadadri: పంచ నారసింహ క్షేత్రం యాదాద్రి గురించి ఈ విషయాలు తెలుసా?
యాదాద్రి గురించి ఈ విషయాలు తెలుసా?

Pancha Narasimha Kshetras of Yadadri: యాదగిరిగుట్ట, తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం అనేక విశేషాలను కలిగి ఉంది. స్థల పురాణం ప్రకారం, యాదర్షి అనే ఋషి నరసింహస్వామి కోసం ఈ కొండపై తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి స్వామివారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చారు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అని కూడా అంటారు. యాదర్షి కోరిక మీదే ఈ కొండకు 'యాదగిరి' అనే పేరు వచ్చిందని చెబుతారు. లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. యాదర్షి కోరిక మేరకు ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటున్నాడు.
ఆలయం వద్ద "విష్ణు పుష్కరిణి" అని పిలువబడే ఒక పవిత్ర కోనేరు ఉంది. స్వామివారి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేసిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇందులో స్నానం చేస్తే సకల కోరికలు తీరుతాయని, పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారని భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించింది. ప్రపంచస్థాయి క్షేత్రంగా తీర్చిదిద్దారు. ఈ నిర్మాణంలో శ్రేష్ఠమైన కృష్ణశిలను భారీగా ఉపయోగించారు. ఆధునిక కాలంలో పూర్తిగా కృష్ణశిలతో ఆలయ నిర్మాణం చేపట్టడం ఒక విశేషం. యాదర్షిని రక్షించిన సుదర్శన చక్రమే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలిసిందని చెబుతారు. భక్తితో చిల్లర నాణేలు వేసినా కరుణిస్తాడని, చిల్లర్ల దేవుడని స్వామిని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
ప్రస్తుతం ఉన్న కొత్త ఆలయానికి కొద్ది దూరంలో, కొండ కింద పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. యాదర్షి తపస్సు చేసి, స్వామి ప్రత్యక్షమైంది ఈ పాత గుడి దగ్గరే అని చెబుతారు. ఇక్కడ గోడలపై అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. యాదగిరిగుట్టలోని స్వామిని "వైద్య నారసింహుడు" అని కూడా పిలుస్తారు. భక్తులు ఇక్కడ విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి, స్వామిని సేవిస్తే ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, మానసిక, శారీరక బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. స్వామివారి మంత్రదండంతో కుడిభుజంపై తాటింపజేయడం ద్వారా భక్తులు స్వామివారు తమను ఆశీర్వదించినట్లు భావిస్తారు. మెట్ల మార్గాన ఆలయానికి వెళ్లే దారిలో ఒక శివాలయం కనిపిస్తుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవిస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.
యాదగిరిగుట్ట ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రదేశం, ఇక్కడ భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకుని తమ కోరికలు తీర్చుకుంటారు.

