Sri Kalyana Srinivasa Swamy: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైన గరుడవాహన సేవ సోమవారం రాత్రి వైభవోపేతంగా జరిగింది.

సర్వాభరణ భూషితుడై, దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో వెలుగొందిన శ్రీ కల్యాణ శ్రీనివాసుడు గరుడునిపై ఆసీనుడై గ్రామ వీధుల్లో విహరించి భక్తజనులను అనుగ్రహించారు.

స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి, “గోవిందా… గోవిందా…” నామస్మరణలతో ఆ ప్రాంతాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. గరుడవాహనంపై స్వామివారి విహారం కనులపండువగా సాగి భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించింది.

పౌరాణిక సంప్రదాయంలో 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవకు విశిష్టమైన స్థానం ఉంది. గరుడుడు జ్ఞాన, వైరాగ్యాలకు ప్రతీకగా భావించబడతాడు. గరుడవాహనంపై విహరించే శ్రీమన్నారాయణుడు తన భక్తుల పట్ల ఉన్న అపార కరుణను చాటుతూ, దాసానుదాస ప్రపత్తి మహిమను లోకానికి తెలియజేస్తాడు. గరుడుని దర్శించడం ద్వారా సర్వపాపాలు నశించి, జ్ఞానవైరాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story