Divine Procession of Gokulananda: కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం జరిగిన హనుమంత వాహనసేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. స్వామివారు శ్రీరామచంద్రుని అలంకారంలో హనుమంత వాహనంపై విరాజిల్లుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

బ్రహ్మోత్సవాల ఆరో రోజు సందర్భంగా హనుమంతునిపై ఆసీనులైన శ్రీ వేణుగోపాలస్వామివారు త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన మహోన్నత ఘట్టాన్ని స్మరింపజేశారు. స్వామివారి దివ్య మంగళవిగ్రహాన్ని దర్శించిన భక్తులు ఆనందభాష్పాలతో పరవశించిపోయారు.

వాహనసేవ మార్గమంతా భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, గోవింద నామసంకీర్తనలు, మంగళవాయిద్యాలు ఉత్సవానికి విశేష శోభను చేకూర్చాయి.

ఆగమ శాస్త్రాల ప్రకారం హనుమంత వాహనంపై శ్రీరామ స్వరూపంలో దర్శనమిచ్చే స్వామివారిని సేవించడం ద్వారా భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గజవాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షిస్తారు. 7వ రోజు శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారు ఊరేగి భక్తులను ఆశీర్వదించనున్నారు.

ఈ వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story