Praying at a Temple: గుడికెళ్లి మొక్కితే..పుణ్యం లభిస్తుందా.?
పుణ్యం లభిస్తుందా.?

Praying at a Temple: మనం నిత్యం ఎన్నో ఆలయాలను దర్శించుకుంటూ ఉంటాం. కానీ, ఆలయానికి వెళ్లడం అంటే కేవలం ఆ రాతి విగ్రహాన్ని చూడటమో, లేక హుండీలో కానుకలు వేయడమో మాత్రమే కాదు. ఆలయ ప్రవేశం అంటేనే మన అంతరంగంలోకి మనం చేసే ఒక ప్రయాణం. విగ్రహారాధన అనేది ఒక బాహ్య ప్రక్రియ మాత్రమే. కానీ దాని వెనుక ఉన్న అసలైన రహస్యం.. ఆ విగ్రహంలో దాగి ఉన్న పరమాత్మ తత్వాన్ని మన హృదయంలో ప్రతిష్టించుకోవడం.
దర్శనం అంటే కేవలం కళ్లతో చూడటం కాదు, మనస్సుతో అనుభూతి చెందడం. గర్భాలయంలోని ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తున్నప్పుడు, భగవంతుడు చేసిన అనంతమైన లీలలను, ఆయన అద్భుత గుణాలను స్మరించుకోవాలి. ఆ నీరాజనం వెలుగులో మనలోని అజ్ఞానమనే చీకటి తొలగిపోవాలి. "స్వామీ! నీవే నాకు శరణు" అని మన అహంకారాన్ని ఆయన పాదాల చెంత ఉంచినప్పుడే, ఆ దర్శనానికి ఒక పరమార్థం లభిస్తుంది.
నిజమైన భక్తుడు అంటే ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా భగవంతుడిని మర్చిపోనివాడు. మన ప్రతి ఆలోచన, ప్రతి అడుగు ఆయనపై ధ్యానంగా మారాలి. భగవంతుడికి నచ్చిన పనులు చేయడం అంటే.. తోటి మనిషికి సాయపడటం, సత్యాన్ని పలకడం , ధర్మబద్ధంగా జీవించడం. ఆలయంలో మనం పొందిన ఆ ప్రశాంతతను, బయట సమాజంలో మన ప్రవర్తన ద్వారా చూపించడమే అసలైన భక్తి.
గుర్తుంచుకోండి.. ఆలయం అనేది ఒక నిదర్శనం మాత్రమే, అసలైన దైవం మీలోనే ఉన్నాడు. కేవలం కంటికి కనిపించే విగ్రహాన్ని చూసి ఆగిపోకుండా, ఆ విగ్రహం మనకు బోధించే సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే మనం బాహ్య దర్శనం నుంచి అంతరంగ దర్శనానికి చేరుకుంటామో, అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. అదే మనకు మోక్షాన్ని ప్రసాదించే మార్గం.

