Dress Code at Jagannath Temple: విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని, గౌరవాన్ని కాపాడటానికి ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. హిందూ ధర్మ సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతించాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని లా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు:

ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల వస్త్రధారణపై కమిషన్ పలు కఠిన నిబంధనలను ప్రతిపాదించింది..

మహిళలకు నిషేధం:

జీన్స్, టీ-షర్టులు లేదా వెస్ట్రన్ షర్టులు ధరించి మహిళలు ఆలయంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించాలని కమిషన్ కోరింది.

చట్ట సవరణ:

ఈ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడానికి 'శ్రీ జగన్నాథ ఆలయ చట్టం'లో అవసరమైన మార్పులు చేయాలని సూచించింది.

ఎవరు ఏ దుస్తులు ధరించాలి?

కమిషన్ ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం భక్తులు ఈ క్రింది విధంగా దుస్తులు ధరించాల్సి ఉంటుంది..

పురుషులు: ధోతీ-కుర్తా, పంచా లేదా సాంప్రదాయ పైజామా-కుర్తా ధరించాలి.

మహిళలు: చీర, బ్లౌజ్ లేదా సల్వార్-కమీజ్ ధరించాలని సూచించారు.

చిన్న పిల్లలు: 10 సంవత్సరాల లోపు బాలికలకు ఫ్రాక్స్ లేదా ఇతర సాంప్రదాయ దుస్తులకు అనుమతి ఉంటుంది.

గతంలో విజ్ఞప్తి.. ఇప్పుడు చట్టం..

గతంలోనే ఆలయ యాజమాన్యం హాఫ్-ప్యాంట్లు, చిరిగిన జీన్స్, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. అయితే చట్టపరమైన నిబంధనలు లేకపోవడంతో వీటిని కఠినంగా అమలు చేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడు లా కమిషన్ సిఫార్సులతో దీనికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఆధ్యాత్మిక క్రమశిక్షణే లక్ష్యం:

దేవాలయం అనేది కేవలం దర్శన ప్రదేశం మాత్రమే కాదు, అది అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. భక్తులు క్రమశిక్షణతో కూడిన వస్త్రాలు ధరించడం వల్ల ఆలయ వాతావరణం మరింత ప్రశాంతంగా, భక్తిపూర్వకంగా మారుతుందని ఆధ్యాత్మిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలోని ఉడుపి శ్రీ కృష్ణ మఠం, బెంగళూరులోని రాజరాజేశ్వరి ఆలయం వంటి చోట్ల ఇటువంటి నియమాలు ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నాయి.

ఒడిశా ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదిస్తే, అతి త్వరలోనే పూరీ జగన్నాథుని దర్శనానికి వెళ్లే భక్తులు సాంప్రదాయ దుస్తులలోనే కనిపించాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story