Bhadrachalam Temple : భద్రాద్రి దేవాలయ ఈఓపై ఆక్రమణ దారుల దాడి
స్పృహ తప్పి పడిపోయిన ఈఓ రమాదేవి

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి భూముల్లో ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నంలో ఆక్రమణదారులు దేవాలయం ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈ దాడిలో ఈఓ స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు ఆమెను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. భద్రచలం దగ్గరలో ఉన్న పురుషోత్తపట్నం గ్రామంలో సీతారామచంద్ర స్వామి వారి దేవస్ధానానికి దాదాపు 889 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తుండటంతో గత రెండు రోజులుగా ఆలయ అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ఈఓ రమాదేవి సీతారామచంద్ర స్వామి దేవస్ధానం సిబ్బందితో పురుషోత్తపట్నం వెళ్లి అక్రమ నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆక్రమణదారులకు దేవాలయ సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఇరువురి మధ్యా తోపులాట జరగడంతో ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు ఈఓ రమాదేవిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే పురుషోత్తపట్నంలోని రాములవారి భూములు భౌగోళిక పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటంతో ఆలయ అధికారులకు అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఏపీ రెవెన్యూ, పోలీసు అధికారులు సహకరించకపోవడంతో ఆలయ వర్గాలు న్యాయస్ధానాలను ఆశ్రయించాల్సిన పరిస్ధితి నెలకొంది.
