Eruvaka Purnima Today: ఇవాళ ఏరువాక పౌర్ణమి: మనిషికి, ప్రకృతికి ముడివేసిన పల్లె పండుగ
పల్లె పండుగ

Eruvaka Purnima Today: తెలుగువారందరికీ, ముఖ్యంగా కష్టాన్నే నమ్ముకున్న అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ... ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి (ఇవాళ)నాడు జరుపుకునే ఈ పండుగ, కేవలం ఒక ఆచారం కాదు... భూమిపుత్రుడు నాగలి పట్టి, నల్లరేగడి మట్టిలో ఆశల విత్తనాలు నాటే ఒక సరికొత్త వ్యవసాయ సంవత్సరానికి శుభారంభం.
ఏరు అంటే నాగలి సాగే దారి...వాక అంటే ప్రారంభం. ఎండలు మండిపోయిన వైశాఖం వెళ్ళిపోయి, తొలకరి చినుకులతో నేలతల్లి పులకించే వేళ ఈ పండుగ వస్తుంది.ఈ రోజున రైతులు తెల్లవారుజామునే లేచి, తమ జీవనాధారమైన ఎడ్లను శుభ్రంగా కడిగి, కొమ్ములకు రంగులు పూసి, మువ్వల గజ్జెలు కడతారు. పశువులను సాక్షాత్తూ నంది స్వరూపంగా భావించి పూజిస్తారు. తమకు అన్నం పెట్టే నాగలికి, ఇతర వ్యవసాయ పనిముట్లకు పసుపు, కుంకుమలు పెట్టి కృతజ్ఞతతో దండం పెట్టుకుంటారు.
ఇళ్లలో ఇల్లాళ్లు ఎంతో భక్తితో ‘పాయసం’ లేదా ‘జొన్న అంబలి’ని వండి, కులదైవానికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత, ఆ ప్రసాదాన్ని పశువులకు తినిపించి, పొలాల్లో చల్లుతారు. ఇలా చేయడం వల్ల పంటలకు ఎలాంటి కీటకాల బాధ ఉండదని, దిగుబడి బాగా వస్తుందని రైతుల నమ్మకం.మంగళ వాయిద్యాల నడుమ, ఊరంతా కలిసి ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి, ఊరేగింపుగా పొలాల్లోకి వెళ్తుంటే... పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది.
ఈ ఏరువాక పౌర్ణమి వెనుక ఒక గొప్ప సామాజిక సందేశం ఉంది. ఇది కేవలం పూజలకే పరిమితం కాదు... మనిషికి, ప్రకృతికి, మూగజీవాలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి ప్రతీక. శ్రమను గౌరవించే సంస్కృతికి అద్దం పట్టే పండుగ. నాగలి సాగితేనే దేశానికి నడక... రైతు సంతోషంగా ఉంటేనే సృష్టికి మనుగడ అనే సత్యాన్ని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది.తొలకరి చినుకులు కురిసి, నేలతల్లి పచ్చటి కోక కట్టుకుని, మన అన్నదాతల ఇళ్లలో ధాన్యపురాశులు నిండాలని ఆశిస్తూ... అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.

