Money Is Placed in the Aarti Plate: హారతి పళ్లెంలో డబ్బులు ఎందుకు వేస్తారో తెలుసా? ఆచారం వెనుక దాగివున్న అసలు సైన్స్ ఇదే..
ఆచారం వెనుక దాగివున్న అసలు సైన్స్ ఇదే..

Money Is Placed in the Aarti Plate: సనాతన హిందూ సంప్రదాయంలో పూజ లేదా వ్రతం పూర్తయిన తర్వాత దేవునికి మహామంగళారతి ఇవ్వడం అత్యంత ముఖ్యం. దేవాలయాలలో గానీ, ఇంట్లో గానీ పూజారి హారతి పళ్ళేన్ని భక్తుల ముందుకు తెచ్చినప్పుడు.. అందరూ హారతి కళ్ళకు అద్దుకుని, ఆ పళ్ళెంలో కొంత డబ్బు లేదా నాణేలు సమర్పించడం మనం చూస్తుంటాం. చాలామంది దీనిని కేవలం ఒక అలవాటుగా భావిస్తారు. కానీ హారతి పళ్ళెంలో డబ్బులు ఉంచే ఈ సంప్రదాయం వెనుక లోతైన ఆధ్యాత్మిక, చారిత్రక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆచారం వెనుక దాగివున్న ఆ ఆసక్తికరమైన నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అహంకార త్యాగం - కృతజ్ఞతా భావం..
భగవంతుడు మనకు ప్రసాదించిన సంపద, ఆరోగ్యం, ఈ జీవితానికి ప్రతిఫలంగా మనం కృతజ్ఞతను చాటుకునే మార్గం ఇది. హారతి పళ్ళెంలో నాణెం వేయడం అనేది కేవలం డబ్బు ఇవ్వడం కాదు.. మనిషి తనలోని మమకారాన్ని, అహంకారాన్ని భగవంతుని పాదాల చెంత త్యాగం చేయడానికి సంకేతం."దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు" అనే నియమం మనిషిలో పిసినారితనాన్ని తొలగించి, త్యాగ గుణాన్ని అలవరుస్తుంది.
ప్రాచీన కాలం నాటి సామాజిక సంక్షేమం..
చారిత్రక కోణంలో చూస్తే, ప్రాచీన కాలంలో దేవాలయాలు కేవలం పూజా మందిరాలు మాత్రమే కావు. అవి సామాజిక, ఆర్థిక విలువల కేంద్రాలుగా విరాసిల్లేవి. రాజులు, భూస్వాములు గుడులకు భారీ విరాళాలు ఇచ్చేవారు. అయితే సామాన్య ప్రజలు కూడా ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో హారతి పళ్ళెంలో కానుకలు వేసే పద్ధతిని తెచ్చారు. ఈ విధంగా సేకరించిన మొత్తాన్ని ఆలయ దీపారాధనకు, పూజా సామాగ్రికి ఉపయోగిస్తారు. గుడి నడవడానికి కారణమయ్యే పురోహితుల జీవనోపాధికి, అలాగే అక్కడికి వచ్చే పేద భక్తులకు అన్నదానం చేయడానికి ఈ నిధులను ఉపయోగించేవారు.
రాగి పళ్ళెం - నాణేల వెనుక ఉన్న శాస్త్రం
ప్రాచీన కాలంలో నాణేలను బంగారం, వెండి లేదా రాగితో తయారు చేసేవారు. హారతిని కూడా రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో ఇస్తారు. కర్పూరపు వేడి ఉన్న పళ్ళెంలోకి ఈ లోహపు నాణేలు వచ్చి పడినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన సానుకూల శక్తి, ప్రకంపనలు పుడతాయి. భక్తులు హారతి తీసుకునేందుకు చేతులు దగ్గరకు తెచ్చినప్పుడు ఆ దైవిక శక్తి వారి శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు.
విలువ కాదు.. భక్తియే ప్రధానం..
శాస్త్రాల ప్రకారం, హారతి పళ్ళెంలో ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు వేశామన్నది ముఖ్యం కాదు. మీ స్తోమతను బట్టి, నిండైన భక్తితో ఒక్క రూపాయి నాణెం వేసినా అది కోటి పుణ్యాలతో సమానమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. భగవంతుడు ఆశించేది మీ సంపదను కాదు.. మీలోని పవిత్రమైన భక్తిని మాత్రమే.

