Accommodation Facilities Arranged for Devotees in Tirumala: తిరుమలలో భక్తులకు విస్తృత వసతి సౌకర్యాలు
భక్తులకు విస్తృత వసతి సౌకర్యాలు

Accommodation Facilities Arranged for Devotees in Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం తదితర సదుపాయాలను కల్పిస్తోంది. భక్తులు దర్శనానికి ముందు స్నానమాచరించి పవిత్రంగా స్వామివారి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ కావడంతో, భక్తుల ఆచారాలు మరియు మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల, తిరుపతిలో అనేక వసతి గదులు మరియు యాత్రికుల వసతి సముదాయాలను టీటీడీ నిర్మించింది.
తిరుమలలో వసతి గదులు పొందదలచిన భక్తులు సీఆర్వో జనరల్ కౌంటరులో ఆధార్ కార్డు, ఫోన్ నంబరు తదితర వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం కేటాయించబడిన గది నంబరు, ఆ ప్రాంత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా భక్తులకు పంపబడతాయి. భక్తులు సంబంధిత ఉప విచారణ కార్యాలయంలో యూపీఐ/కార్డు ద్వారా చెల్లింపు చేసి గదిని పొందవచ్చు. తిరుమలలో స్థలాభావం కారణంగా 7800 వసతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నందున, కుటుంబాలతో వచ్చిన భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. ఒంటరి మరియు అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదుల కేటాయించబడవు. వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో ఐదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు నమోదు చేసి ఉచిత లాకర్లు మరియు ఇతర సౌకర్యాలను పొందవచ్చు.
పీఏసీ-1 : సీఆర్వో సమీపంలోని గోవర్ధన్ సత్రం ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 4 హాళ్లు, 1256 లాకర్లు ఉన్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ పనుల కారణంగా 870 లాకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నప్రసాదం సౌకర్యం కలదు.
పీఏసీ-2 (మాధవ నిలయం) : బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 12 హాళ్లు, 3300 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రం, విశ్రాంతి సదుపాయాలు కల్పించబడ్డాయి.
పీఏసీ-3 : జీఎన్సీ టోల్ గేట్ నుండి రాంభగీచా బస్ స్టాండ్కు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న ఈ భవనంలో 9 హాళ్లు, 1420 లాకర్లు ఉన్నాయి. తలనీలాలు సమర్పించే సదుపాయం మరియు విశ్రాంతి సౌకర్యం కలదు.
(పద్మనాభ నిలయం) : బాలాజీ బస్ స్టాండ్ లోపల ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 3 హాళ్లు, 960 లాకర్లు ఉన్నాయి. ఇక్కడ విశ్రాంతి, లాకర్, స్నాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
పీఏసీ-5 (వేంకటాద్రి నిలయం) : భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ ఆధునిక సముదాయాన్ని 2025 సెప్టెంబర్ 25న భారత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ,సీఎం చంద్రబాబు ప్రారంభించారు. CRO వెనుక భాగంలో ఉన్న ఈ భవనంలో 16 హాళ్లు, 2400 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పణ, ప్రథమ చికిత్స, విశ్రాంతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని ఈ ఐదు యాత్రికుల వసతి సముదాయాలన్నింటిలో కలిపి మొత్తం 9336 లాకర్లు భక్తులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. భక్తులు తమ విలువైన వస్తువులను భద్రపరచుకోవడానికి వీటిని వినియోగించుకోవచ్చు.
ఈ కేంద్రాలలో ఉచిత వేడి నీటి స్నాన గదులు, మరుగుదొడ్లు, చాపలు, రగ్గులు, అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం భక్తులు లాకర్లు ఖాళీ చేసి, తీసుకున్న చాపలు, రగ్గులు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. భక్తులు ఈ యాత్రికుల వసతి సముదాయాలను వినియోగించుకుని స్వామివారి దర్శనాన్ని సుఖసంతోషాలతో పూర్తి చేసుకోవాలని, దర్శనం అనంతరం గదులు మరియు లాకర్లు వెంటనే ఖాళీ చేసి ఇతర భక్తులకు కూడా అవకాశం కల్పించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

