Death Occurs During Lunar Eclipse: మార్చి 3న ఏడాది తొలి చంద్రగ్రహణం.. ఆ సమయంలో మరణం సంభవిస్తే ఏం చేయాలి?
ఆ సమయంలో మరణం సంభవిస్తే ఏం చేయాలి?

Death Occurs During Lunar Eclipse: జ్యోతిషశాస్త్రం, హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం.. గ్రహణ సమయాన్ని అత్యంత కీలకమైన కాలంగా పరిగణిస్తారు. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి 3న, ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున సంభవిస్తోంది. ఈ గ్రహణం సింహ రాశి, పూర్వా ఫాల్గుణి నక్షత్రంలో ఏర్పడనుందని జ్యోతిష్కులు వెల్లడించారు. ఈసారి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి సూతక కాలం నియమాలు ఇక్కడ వర్తిస్తాయి. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దేవాలయాల తలుపులు మూసివేస్తారు. భోజనం చేయడం, శుభకార్యాలు నిర్వహించడం నిషిద్ధం. కేవలం దైవ నామ స్మరణ, మంత్ర జపం, తపస్సు చేయడం మాత్రమే శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.
గ్రహణం సమయంలో అంత్యక్రియలు నిర్వహించవచ్చా?
గ్రహణ సమయంలో లేదా సూతక కాలంలో ఎవరైనా మరణిస్తే, అంత్యక్రియలు నిర్వహించడంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉంటాయి. శాస్త్రాల ప్రకారం.. గ్రహణ సమయంలో అంతిమ సంస్కారాలు నిర్వహించడం అశుభంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసే ఆచారాలు ఆత్మ శాంతికి ఆటంకం కలిగిస్తాయని, కుటుంబంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని విశ్వాసం.
గ్రహణం లేదా సూతక కాలంలో మరణం సంభవిస్తే, గ్రహణం ముగిసే వరకు వేచి ఉండటం ఉత్తమం. గ్రహణ సమయం తక్కువగానే ఉంటుంది కాబట్టి అది పూర్తయిన తర్వాతే శుద్ధి కర్మలు నిర్వహించి అంత్యక్రియలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.
గ్రహణం తర్వాత ఏం చేయాలి?
గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత ఇల్లు, పూజా గదులను శుద్ధి చేసుకోవాలి. పవిత్ర నదుల్లో లేదా ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం ఆచరించడం ద్వారా గ్రహణ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

