Chinna Sesha Vahana Seva: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చిన్నశేష వాహనసేవ భక్తి భావంతో పాటు జానపద కళల సందడితో వైభవంగా సాగింది. మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, భక్తిగీతాలతో తిరుమల వీధులు మార్మోగాయి. ఈ వాహనసేవలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల్లోని 489 మంది కళాకారులు పాల్గొన్నారు. తమ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ జానపద కళలను ప్రదర్శిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు.

ఆకట్టుకున్న జానపద నృత్యాలు

ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన తప్పెటగుళ్ల నృత్యం లయబద్ధమైన అడుగులు, తప్పెట వాయిద్యాల హోరుతో అలరించింది. అరకులోయ గిరిజన ప్రాంతానికి చెందిన థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు వృత్తాకారంలో నృత్యం చేస్తూ తమ సంప్రదాయాలను చాటిచెప్పారు. తమిళనాడుకు చెందిన కళాకారుల కురత్తి నృత్యం జానపద కథలు, హావభావాలతో ఆకట్టుకోగా, కర్ణాటకలోని ఉడిపి, దక్షిణ కన్నడ ప్రాంతాల కళాకారులు పాటలు, నృత్యాలతో తమ సంస్కృతిని పరిచయం చేశారు.

భక్తితో పాటు సంస్కృతికి పెద్దపీట

శ్రీవారి వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు పాల్గొని తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించడంతో తిరుమలలో ఆధ్యాత్మికతతో పాటు భారతీయ సంస్కృతి వైవిధ్యం వెల్లివిరిసింది. స్వామివారి సేవలో కళలను ప్రదర్శించడం తమకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని కళాకారులు భావించారు. భక్తులకు ఈ ప్రదర్శనలు కనువిందు చేశాయి.

Next Story