From Ayodhya to Goa: అయోధ్య నుండి గోవా వరకు.. ఈ ఏడాది జనం ఎక్కువగా సందర్శించిన మూడు దివ్య క్షేత్రాలు ఇవే..
ఈ ఏడాది జనం ఎక్కువగా సందర్శించిన మూడు దివ్య క్షేత్రాలు ఇవే..

From Ayodhya to Goa: 2025వ సంవత్సరం ముగింపుకు చేరుకుంటున్న తరుణంలో ఈ ఏడాది భారతీయ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక రంగంలో కొన్ని దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా విశేషంగా నిలిచాయి. ముఖ్యంగా అయోధ్య, పూరి, మరియు గోవాల్లో జరిగిన చారిత్రాత్మక ఘట్టాలు భక్తులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. వార్తల్లో నిలిచిన ఆ మూడు ప్రధాన దేవాలయాల విశేషాలు ఇవే:
అయోధ్య రామమందిరం: ధ్వజారోహణంతో సంపూర్ణం
2024లో ప్రారంభమైన అయోధ్య రామమందిర నిర్మాణం, 2025 నవంబర్ 25న ఒక చారిత్రక మైలురాయిని చేరుకుంది. శ్రీరాముడు, సీతాదేవిల కళ్యాణం జరిగిన వివాహ పంచమి పర్వదినాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మందిర శిఖరంపై కాషాయజెండాను ఆవిష్కరించారు. దీంతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తయినట్లు ప్రకటించారు. ఈ జెండాపై సూర్యుడు, ఓం, కోవిదార వృక్షం చిహ్నాలు ఉండటం విశేషం.
జగన్నాథ రథయాత్ర: లక్షలాది మంది భక్తజన సంద్రం
ఒడిశాలోని పూరిలో ప్రతి ఏటా జరిగే జగన్నాథ రథయాత్ర 2025లోనూ కనులపండువగా సాగింది. ఈ ఏడాది జూన్ 27న ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు ఈ యాత్ర ప్రారంభమైంది.
జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి మూడు భారీ రథాలపై అత్తగారి ఇల్లైన గుండిచా ఆలయానికి పయనమయ్యారు. ఈ పవిత్ర యాత్రను వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు పూరి తీరానికి తరలివచ్చారు.
గోవాలో శ్రీరామ ప్రభంజనం
సాధారణంగా పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గోవా ఈ ఏడాది ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. కణకోణలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 28న ప్రధానమంత్రి చేతుల మీదుగా 77 అడుగుల భారీ కాంస్య శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాలలో ఒకటిగా నిలిచింది. ప్రముఖ శిల్పి రామ్ సుతార్ దీనిని రూపొందించారు. అదే సమయంలో ఇక్కడ రామాయణ థీమ్ పార్కును కూడా ప్రారంభించారు.

