Ganapati Puja Said to Be a Powerful Remedy for Mercury-Rahu Doshas: హిందూ సనాతన ధర్మంలో గణపతిని ప్రథమ పూజ్యుడిగా, విజ్ఞానానికి మరియు సకల విఘ్నాలను తొలగించే అధిపతిగా భావిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, మానసిక గందరగోళంతో సతమతమయ్యే వారికి గణేశుని ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

రాహు దోష నివారణ – మానసిక ప్రశాంతత

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు భ్రమలకు, మనోభావాల గందరగోళానికి, తప్పుడు నిర్ణయాలకు కారణమయ్యే ఛాయాగ్రహం. మరోవైపు వినాయకుడు బుద్ధి, విచక్షణ, జ్ఞానాలకు ప్రతీక. గణపతిని పూజించడం వల్ల జాతకంలో రాహువు వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా చదువుపై ఏకాగ్రత కుదరని విద్యార్థులు గణేశుడిని నిత్యం పూజించడం వల్ల జ్ఞాపకశక్తి, గ్రహణ శక్తి పెరుగుతాయి.

బుధ గ్రహ బలహీనతలు – పరిష్కారం

గణేశుని ఆరాధన జాతకంలో బుధుడి బలాన్ని పెంచుతుంది. జాతక చక్రంలో బుధుడు 4, 6, 8, 9 లేదా 12వ స్థానాల్లో ఉండి మిథునం, తుల, కుంభ రాశులతో సంబంధం కలిగి ఉంటే, ఆలోచనలను సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నవారు గణపతిని క్రమం తప్పకుండా ప్రార్థిస్తే స్పష్టమైన ఆలోచనలు, సంభాషణా చాతుర్యం అలవడతాయి.

ప్రత్యేకంగా పూజించాల్సిన రాశులు

వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం..

ఈ రాశుల వారు బుధ గ్రహ దోషాలు, ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందడానికి వినాయక చవితి రోజున ఉపవాసం ఉండటం, లేదా నిత్యం గణపతి సంకట నాశన స్తోత్రం పఠించడం అత్యంత శ్రేయస్కరం. ఈ పూజల ద్వారా వివేకం, సమయస్ఫూర్తి, జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించే మానసిక దృఢత్వం చేకూరుతాయని పండితులు విశ్వసిస్తున్నారు.

Next Story