Ganesh Chaturthi 2026: గణేష్ చతుర్థి 2026: ఇంట్లో వినాయకుడి ప్రతిష్ఠాపన.. వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి.. ?
వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి.. ?

Ganesh Chaturthi 2026: హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. విఘ్నాలను తొలగించి, సకల శుభాలను చేకూర్చే గణనాథుడి జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తులు వాడవాడలా, ఇళ్లలో గణపతి విగ్రహాలను కొలువుదీరుస్తారు. దృక్ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది 2026 గణేష్ చతుర్థి వేడుకలు సెప్టెంబర్ 14న ప్రారంభమై, సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి నాడు గణపతి నిమజ్జనంతో ముగియనున్నాయి. అయితే, ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించే సమయంలో కేవలం పూజా విధానాలే కాకుండా వాస్తు శాస్త్ర నియమాలను కూడా తప్పనిసరిగా పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏ దిశ శ్రేష్ఠం?
వాస్తు శాస్త్రం ప్రకారం.. పూజలకు మరియు ఆధ్యాత్మిక సాధనలకు ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనది. కాబట్టి గణపతి విగ్రహాన్ని ఈశాన్యంలో ఉంచడం సర్వతోముఖాభివృద్ధికి కారణమవుతుంది. ఒకవేళ అక్కడ స్థలం అనుకూలించకపోతే, ప్రత్యామ్నాయంగా ఉత్తరం లేదా పడమర దిశలలో కూడా స్వామివారిని ప్రతిష్ఠించవచ్చు.
స్వామి ముఖం ఎటువైపు ఉండాలి? వెనుక భాగం రహస్యమేమిటి?
గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆయన ముఖం ఇంటి లోపలి వైపు చూస్తున్నట్లుగా అమర్చాలి. ఆయన వీపు భాగం ఎప్పుడూ గోడ వైపు మాత్రమే ఉండాలి తప్ప, ఇంట్లోని గదుల వైపు లేదా బహిరంగ ప్రదేశాల వైపు ఉండకూడదు. పురాణాల ప్రకారం.. గణపతి ముఖ భాగంలో సకల సంపదలు, సుఖసంతోషాలు కొలువై ఉంటాయని, ఆయన వీపు భాగంలో దారిద్ర్యం ఉంటుందని ఒక విశ్వాసం. అందుకే స్వామివారి వీపు భాగం ఇంట్లోని వ్యక్తులకు లేదా ప్రధాన హాల్ వైపు నేరుగా కనిపించకుండా గోడను ఆనుకుని ఉండేలా ఏర్పాటు చేయాలి.
విగ్రహం ఎలా ఉండాలి? ఎక్కడ ఉంచకూడదు?
పర్యావరణానికి మేలు చేసేలా, నిమజ్జనానికి సులువుగా ఉండేందుకు పూర్తిగా మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.
గణపతి విగ్రహాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు. శుభ్రమైన పలక లేదా పీఠంపై ఎరుపు, పసుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిపై స్వామివారిని ఆసీనులను చేయాలి. పూజా స్థలం ఎల్లప్పుడూ అత్యంత పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
ప్రతిష్ఠాపన - పూజా నియమాలు:
చతుర్థి నాడు ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి.
నిర్ణీత శుభ ముహూర్తంలో కలశ స్థాపన చేసి, మంత్రోచ్ఛారణలతో విఘ్నేశ్వరుడిని ఆవాహన చేయాలి.
స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన గరిక (దూర్వా గడ్డి), మోదకాలు (కుడుములు), లడ్డూలు, జిల్లేడు పూలతో శాస్త్రోక్తంగా పూజించాలి.
ఇంట్లో గణపతి ఉన్నంత కాలం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ధూపదీప నైవేద్యాలు సమర్పించి, హారతి ఇవ్వడం తప్పనిసరి. పూజా స్థలం నిరంతరం పవిత్రంగా ఉండేలా జాగ్రత్త వహించాలి.

