Ganesh Visarjan 2026: దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. క్యాలెండర్ ప్రకారం, 2026 సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థితో ప్రారంభమైన ఈ వేడుకలు సెప్టెంబర్ 25న వచ్చే అనంత చతుర్దశితో ముగియనున్నాయి. ఇళ్లలో, పండళ్లలో భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన లంబోదరుడిని సంప్రదాయం ప్రకారం నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే గణపతి నిమజ్జనం అనేది కేవలం విగ్రహాన్ని నీటిలో కలపడం మాత్రమే కాదు; బప్పాకు భక్తిప్రపత్తులతో, గౌరవంగా వీడ్కోలు పలికే ఒక పవిత్ర సంప్రదాయం. అందుకే నిమజ్జన సమయంలో కొన్ని ముఖ్యమైన పూజా నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

నిమజ్జనానికి ముందు తప్పనిసరిగా చేయాల్సిన ఉత్తర పూజ

మత విశ్వాసాల ప్రకారం గణపతి విసర్జనకు ముందు శాస్త్రోక్తంగా ఉత్తర పూజ నిర్వహించాలి:

నైవేద్యాలు, హారతి:

నిమజ్జనానికి తరలించే ముందు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి పువ్వులు, గరిక, ఉండ్రాళ్ళు, మోదకాలను నైవేద్యంగా సమర్పించాలి.

క్షమాపణ ప్రార్థన:

పూజా సమయంలో తెలిసి లేదా తెలియక ఏవైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని కోరుతూ చివరగా హారతి ఇచ్చి ప్రార్థించాలి.

విగ్రహాన్ని కదల్చడం:

ఉత్తర పూజ పూర్తయిన తర్వాత గణపతి విగ్రహాన్ని అది ఉన్న స్థానం నుంచి కొద్దిగా ముందుకు లేదా పక్కకు జరపాలి. దీనిని బప్పా నిమజ్జన ప్రయాణానికి సన్నాహంగా భావిస్తారు.

సుఖశాంతుల కాంక్ష:

కుటుంబంలో ఆయురారోగ్యాలు, శాంతి, శ్రేయస్సు కలగాలని స్వామివారిని వేడుకోవాలి.

గౌరవపూర్వకంగా సాగనంపాలి

జయజయధ్వానాలతో యాత్ర:

విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లే సమయంలో అత్యంత గౌరవంగా పట్టుకోవాలి. కుటుంబ సభ్యులు, భక్తులు అందరూ కలిసి "గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది త్వరగా రా" అంటూ భక్తిభావంతో నినాదాలు చేస్తూ స్వామిని సాగనంపాలి.

ఒంటరిగా పంపకూడదు:

గణేష్ విసర్జన అనేది ఉత్సవాల ముగింపు ఘట్టం. కాబట్టి బప్పాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా పంపకుండా, కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లి నిమజ్జనం చేయాలి.

నిమజ్జనం వేళ అస్సలు చేయకూడని తప్పులు..

తొందరపాటు, అజాగ్రత్త వద్దు:

నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి తొందరపాటు ప్రదర్శించకూడదు. విగ్రహాన్ని విసిరేయడం లేదా అజాగ్రత్తగా నీటిలోకి జారవిడవడం వంటి అగౌరవ చర్యలకు పాల్పడకూడదు. ఎంతో భక్తితో, నెమ్మదిగా నీటిలో ఉంచాలి.

పర్యావరణ పరిరక్షణ ముఖ్యం:

నీటి కాలుష్యానికి లేదా పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా సహజ నీటి వనరులను పాడుచేయకూడదు. ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు ఏర్పాటు చేసిన కృత్రిమ నిమజ్జన కొలనులను వినియోగించడం ఉత్తమం.

భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో వీడ్కోలు పలికినప్పుడే ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కుటుంబంపై సంపూర్ణంగా ఉంటుందని పండితులు గుర్తుచేస్తున్నారు.

Next Story