“God Has No Eyes”: దేవునికి కళ్లు లేవు అని ఎందుకంటారు.. ఇది నిస్సహాయుడి శక్తివంతమైన ప్రార్థన..
ఇది నిస్సహాయుడి శక్తివంతమైన ప్రార్థన..

“God Has No Eyes”: నిత్య జీవితంలో మనం తరచుగా ఉపయోగించే సామెతలు, సూక్తుల వెనుక విజ్ఞానమే కాదు, అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యాలు కూడా దాగి ఉంటాయి. అటువంటి వాటిలో ఒకటి “దేవునికి కళ్లు లేవు”. సాధారణంగా ఈ మాటను నిరాశలో వాడతామని మనం భావిస్తాం. కానీ ఈ మాట వెనుక ఉన్న అసలు పరమార్థం ఏంటో పండితులు వివరించారు.
ఎప్పుడు పుడుతుంది ఈ ఆక్రందన?
మనిషి తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు, అన్ని దారులు మూసుకుపోయి నిస్సహాయ స్థితికి చేరుకున్నప్పుడు హృదయాంతరాల నుండి ఈ మాట వెలువడుతుంది. న్యాయం మన పక్షాన ఉన్నా, అన్యాయం చేతిలో ఓడిపోయినప్పుడు లేదా బలవంతుల అణచివేతకు గురై విసిగిపోయినప్పుడు సామాన్యుడి నోటి నుండి వచ్చే ఈ పిలుపు అత్యంత శక్తివంతమైనది.
జప తపస్సుల కంటే మిన్న
మనం భక్తిగా, ధర్మబద్ధంగా ఉన్నా.. ఆర్థికంగా, మానసికంగా కుప్పకూలిపోయిన తరుణంలో సహజంగానే "దేవునికి కళ్ళు లేవు" అని అంటాం. ఈ మాట అనడానికి ఎటువంటి పాండిత్యం లేదా సన్యాసత్వం అవసరం లేదు. నిస్సహాయుడి హృదయం నుండి వచ్చే ఈ పిలుపు, ఏ జపం లేదా పూజ కంటే వేగంగా దైవాన్ని చేరుకుంటుంది. చేసినది అనుభవించక తప్పదు అనే కర్మ సిద్ధాంతం కంటే, ఈ ఆవేదనతో కూడిన మాటకు దైవకృపను వెంటనే పొందే శక్తి ఉందని పండితులు తెలిపారు.
పురాణాల్లో సాక్ష్యం: ద్రౌపది వస్త్రాపహరణం
మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాన్ని పండితులు ఇందుకు ఉదాహరణగా చెప్పారు. కురుసభలో భీష్ముడు, ద్రోణుడు వంటి మహామహులు, తన భర్తలైన పాండవులు ఉన్నా ద్రౌపదికి రక్షణ కరువైంది. ఆ నిస్సహాయ స్థితిలో ఆమె తన హృదయ కాలేయం నుండి "తండ్రీ.. నీకు కళ్ళు ఉన్నాయా?" అని శ్రీకృష్ణుడిని నిలదీసింది. ఆ పిలుపులోని ఆర్తికి చలించిన కృష్ణుడు వెంటనే అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమెను రక్షించాడు.
కలియుగంలో ఆశ కిరణం
నేటి కలియుగంలో కూడా మనం సత్య మార్గంలో నడుస్తున్నా కష్టాలు చుట్టుముట్టినప్పుడు, ఈ నానుడి ఒక శాపంగా కాకుండా దేవుడిని తట్టి లేపే ఒక ఆఖరి ఆశగా నిలుస్తుంది. "దేవునికి కళ్ళు లేవు" అని మనం వాపోయే క్షణం.. దేవుడు మన మొర ఆలకించే సమయం ఆసన్నమైందని గుర్తించాలని పండితులు హితవు పలికారు.

