Kalki on Ashvavahana: అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు
కల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

Kalki on Ashvavahana: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం.
వాహనసేవలలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి టి.జానకి దేవి, శ్రీ నరేష్ కుమార్, శ్రీ ఎం. శాంతారామ్, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి.మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

