Sri Kalyana Venkateswara Swamy Temple: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి బంగారు పూత పూసిన గజ వాహనం, సింహ వాహనాలను దాతలు విరాళంగా సమర్పించారు. బుధవారం ఉదయం ఆలయ వాహన మండపం వద్ద ఈ వాహనాలను దాతలు ఆలయ అధికారులకు అందజేశారు.

హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి పి.వి. లక్ష్మీ రెడ్డి సింహ వాహనాన్ని, శ్రీమతి పి.వి. దివ్య ప్రియాంక గజ వాహనాన్ని ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీ వరలక్ష్మీకి అందజేశారు. సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు పూత పూసిన ఈ రెండు వాహనాలను దాతలు సమర్పించారు. ఈ రెండు వాహనాలను స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఉపయోగించనున్నారు.

ఈ సందర్భంగా వాహన మండపంలో గజ వాహనం, సింహ వాహనాలకు ఆలయ అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణలతో వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి సేవకు వాహనాలను సమర్పించడం పట్ల దాతలు భక్తి, ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం దాతలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించి, స్వామివారి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ దీక్షితులు, శ్రీ నారాయణ చార్యులు, ఇతర అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Next Story