కీలపట్ల స్వామివారి వార్షిక వేడుకల షెడ్యూల్ విడుదల

Keelapatla Swamy Temple: తిరుమల వేంకటేశ్వర స్వామికి ప్రతిరూపంగా కొలిచే ఈ స్వామివారి వేడుకల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలకు ముందే ఏప్రిల్ 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి), 23న అంకురార్పణ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం మొదలవుతుంది. ఏప్రిల్ 24న ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమై, పది రోజుల పాటు భక్తులకు కనువిందు చేయనున్నాయి.

ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి సమయాల్లో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ముఖ్యంగా ఏప్రిల్ 28న జరిగే గరుడ వాహన సేవ, మే 01న జరిగే రథోత్సవం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే హంస, సింహ, కల్పవృక్ష, హనుమంత, గజ వాహన సేవలతో పాటు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఈ వాహన సేవలు నిర్వహిస్తారు.

మరో విశేషమేమిటంటే, ఏప్రిల్ 28న సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుంది. కేవలం రూ. 500 చెల్లించి భక్తులు (ఒక జంట) ఈ వేడుకలో నేరుగా పాల్గొనవచ్చు. కల్యాణంలో పాల్గొనే వారికి ఉత్తరీయం, రవికె ముక్కతో పాటు అన్నప్రసాదాన్ని అందజేస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా మే 02న చక్రస్నానం, మే 03న సుగంధ పుష్పాలతో నిర్వహించే పుష్పయాగం భక్తులను పరవశింపజేస్తాయి. ఉత్సవాల సందర్భంగా టీటీడీ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story