Kailash Mansarovar Yatra 2026: హిమాలయాల్లోని శివుని నివాస స్థానమైన కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని తపించే భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి గానూ కైలాస మానసరోవర యాత్రకు అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

60 ఏళ్ల తర్వాత అగ్ని అశ్వ సంవత్సరం విశిష్టత ఏంటి?

ఈ ఏడాది యాత్రకు జ్యోతిష్య పరంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. సుమారు 60 ఏళ్ల తర్వాత హిమాలయాల్లో సంభవించే అరుదైన అగ్ని అశ్వ ఖగోళ సంయోగం ఈ ఏడాదే రావడం విశేషం. ఈ సమయంలో కైలాస పర్వతాన్ని సందర్శించడం వల్ల మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయని హిందూ, జైన, బౌద్ధ మతస్థుల నమ్మకం. ఈ దివ్య యోగం కారణంగా ఈసారి యాత్రికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

యాత్రకు రెండు మార్గాలు:

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యాత్రికుల కోసం రెండు మార్గాలను అందుబాటులో ఉంచింది..

లిపులేఖ్ కనుమ: ఇది పురాతన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం. ఇందులో పవిత్ర కైలాస ప్రదక్షిణ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్లను మెరుగుపరిచారు.

నాథు లా కనుమ (సిక్కిం):

సిక్కిం మీదుగా సాగే ఈ ప్రయాణం శారీరకంగా కాస్త సులభంగా ఉంటుంది. ట్రెక్కింగ్ తక్కువగా ఉండాలనుకునే వారు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు.

ముఖ్యమైన వివరాలు:

ప్రారంభం: మొదటి బృందం జూన్ మొదటి వారంలో బయలుదేరుతుంది.

కోటా: ఉత్తరాఖండ్ మార్గం ద్వారా 500 మంది యాత్రికులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సమయం: వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఈ యాత్ర పూర్తి కావడానికి 15 నుండి 20 రోజులు పడుతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఆసక్తి గల భక్తులు MEA అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ లేదా OCI కార్డ్ తప్పనిసరి.

ఎత్తైన ప్రదేశాల్లో ప్రయాణం కాబట్టి, ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుడి నుండి మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

యాత్రికులకు సూచన:

కైలాస పర్వతం సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. భక్తులు యాత్రకు కొన్ని రోజుల ముందే శారీరక వ్యాయామం ప్రారంభించాలని, ఎత్తైన వాతావరణానికి అలవాటు పడాలని వైద్యులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story