Good News for Tirumala Devotees: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. టెక్నాలజీ సాయంతో సకాలంలో శ్రీవారి దర్శనం
టెక్నాలజీ సాయంతో సకాలంలో శ్రీవారి దర్శనం

Good News for Tirumala Devotees: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టెక్నాలజీ సాయంతో నిర్దేశించిన సమయానికి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు సూచించారు. టిటిడి కార్యనిర్వాహనాధికారి సమావేశ మందిరంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం టిసిఎస్ ప్రతినిధులు, టిటిడి ఐటీ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం (ఎస్.ఎస్.డి), ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్.ఈ.డి), దివ్యదర్శనం తదితర మార్గాల ద్వారా తిరుమలకు భక్తులు వస్తుంటారని, సదరు భక్తులకు టెక్నాలజీ సాయంతో సకాలంలో దర్శనం చేయించడంపై తగు చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. భక్తులు శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో చేరినప్పటి నుండి దర్శనం అయ్యే వరకు టెక్నాలజీని ఉపయోగించి శ్రీవారి దర్శనం సులభతరం చేయించే అంశానికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై నిర్ధిష్ట నిర్ణయానికి వచ్చేందుకు టిసిఎస్ ప్రతినిధులు, టిటిడి ఐటీ విభాగంతో కూడిన ప్రతినిధులు తరచూ సమావేశాలు నిర్వహించి ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
టిటిడిలో ఇప్పటి వరకు టిటిడి సిబ్బందితో భక్తులను ధృవీకరించడం జరుగుతోందని, సాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న మార్పులకు అనుగుణంగా క్యూఆర్ కోడ్, ముఖ గుర్తింపు పద్దతి ద్వారా భక్తులను ధృవీకరించి మరింత సమయాన్ని ఆదా చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఈవో కోరారు. అదే విధంగా శ్రీవారి దర్శనానికి భక్తులకు కేటాయించిన సమయానికి రాకపోవడం మూలంగా మరింత ఆలస్యం అవుతోందని, భక్తులను నిర్దేశించిన సమయానికి వారికి కేచాయించిన ప్రాంతానికి వచ్చేలా భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా మరింత సమయం ఆదా కావడమే కాక, భక్తులకు సంతృప్తికరమైన శ్రీవారి దర్శనం చేయించవచ్చని అధికారులకు సూచించారు.
అంతకుముందు, భక్తులు క్యూలైన్లలో ప్రవేశించినప్పటి నుండి కంపార్మెంట్లలో ఎంత సేపు ఉంటున్నారు, క్యూలైన్లలో భక్తులు చేరినప్పటి నుండి శ్రీవారి దర్శనానికి ఎంత సమయం అవుతోంది, అనంతరం ఆలయం నుండి వెలుపలికి రావడానికి ఎంత సమయం పడుతోంది, సమయ నిర్దేశిత సర్వదర్శనం ( ఎస్.ఎస్.డి), ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్.ఈ.డి), దివ్యదర్శనం, ఆర్జిత సేవలకు భక్తులు దర్శనం కోసం వేచియున్న సమయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టిసిఎస్ ప్రతినిధులు వివరించారు.
