చక్రతీర్థ ముక్కోటి

Chakratheertha Mukkoti in Tirumala: తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి మంగళవారం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హార‌తి ఇచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మ‌హావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్ర‌ముఖ తీర్థంగా భాసిల్లుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story