Gokulashtami Go Puja: టీటీడీ గోశాలలో వైభవంగా గోకులాష్టమి గోపూజ
గోకులాష్టమి గోపూజ

Gokulashtami Go Puja: గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ గోమాత, దూడలకు నూతన వస్త్రాలు, పుష్పమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి హారతి సమర్పించారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో గోమాత పాలను స్వయంగా పితికి, పవిత్రమైన ఆ పాలను ఆలయ అర్చకులకు అందించారు. ఆ పాలను శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం చేయడం విశేషంగా జరిగింది.
7 కోట్ల సార్లు “ఓం నమో వేంకటేశాయ” జప సమర్పణ
అనంతరం “ఓం నమో వేంకటేశాయ” మహామంత్రాన్ని 7 కోట్ల సార్లు జపించిన జప పుస్తకాలను స్వామివారికి సమర్పించే కార్యక్రమాన్ని ఈవో సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపను కోరారు.
గోమాత పూజ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన సంప్రదాయమని, గోమాతలో సమస్త దేవతా స్వరూపాలను దర్శించే గొప్ప ఆధ్యాత్మిక విశ్వాసం మన సంప్రదాయంలో ఉందన్నారు.
గోసంరక్షణ, గోసేవకు టీటీడీ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ గోశాలను మరింత అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో (విద్య, ఆరోగ్యం) శ్రీ ప్రభల గోపీనాథ్, గోశాల డైరెక్టర్ శ్రీ శివకుమార్, విజీవో శ్రీ గిరిధర్, ఇంఛార్జి డిఎల్వో శ్రీ వెంకట సుబ్బానాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

