గరుడసేవ

Brahmotsava Garuda Seva: ఈ ఏడాది సెప్టంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా టీటీడీ మాదిరి గరుడ సేవను నిర్వహించింది.
సాధారణంగా ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించుకోవడంలో భాగంగా టీటీడీ ఈ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.
రాత్రి 7 నుండి 9 గంటల నడుమ జరిగిన ఈ గరుడ సేవలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడులతో కలిసి నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
కాగా శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ వాహనసేవలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ శాంతారామ్, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ శ్రీధర్ వర్మ, చీఫ్ ఇంజనీర్ శ్రీ మనోహరం, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీఓ శ్రీ సురేంద్ర, ఇతర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

