వైభవంగా పుష్పయాగం

Grand Pushpayagam: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగం వైభవంగా జరిగింది.

ఈ ఆలయంలో జూన్ 07 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని కొలువుతీర్చారు.

మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. ఒక టన్ను పుష్పాలను ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి టిటిడి సరఫరా చేసింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story