Sri Lakshmi Venkateswara Swamy Temple: శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా జీర్ణోద్ధారణ
జీర్ణోద్ధారణ

Sri Lakshmi Venkateswara Swamy Temple: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవానికి ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆగమోక్త వైదిక మంత్రోచ్ఛారణల నడుమ వాస్తుశాంతి, మృత్సంగ్రహణం, కుంభారాధన, అంకురార్పణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆగస్టు 24న ఉదయం 8 గంటలకు మనోన్మాన ప్రమాణ శాంతి హోమం, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనం, శాత్తుమొర, సాయంత్రం 6.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఆగస్టు 25న ఉదయం 7.30 గంటలకు చతుస్థానార్చన, ఏకశీతి కలశ స్నపనం, మూర్తి హోమం, అష్టబంధనం, సాయంత్రం 6 గంటలకు శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం, శాత్తుమొర నిర్వహించనున్నారు.
ఆగస్టు 26న ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించి, ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.
మహాసంప్రోక్షణ అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

