Hajj 2026: హజ్ యాత్ర 2026: కొత్త భద్రతా నిబంధనలు అమలు.. మక్కా, మదీనాలో వంటపై నిషేధం..
మక్కా, మదీనాలో వంటపై నిషేధం..

Hajj 2026: పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం ఈ ఏడాది సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా మక్కా మరియు మదీనాలోని బస కేంద్రాల్లో యాత్రికులు స్వయంగా వంట చేసుకోవడాన్ని పూర్తిగా నిషేధించారు. వంట చేసే సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, భద్రతా కారణాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
హజ్ 2026 - కీలక మార్పులు ఇవే
నడక తప్పనిసరి: మక్కా, మదీనాలోని పవిత్ర స్థలాల సందర్శన సమయంలో యాత్రికులు కనీసం 5 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. భద్రతా వలయాలు, రద్దీ నియంత్రణలో భాగంగా ఈ మార్పులు చేశారు.
హైటెక్ నిఘా: ప్రతి యాత్రికుడికి ఈసారి ఒక డిజిటల్ బ్రాస్లెట్ అందించనున్నారు. ఇది హజ్ సువిధ యాప్ 2.0కు అనుసంధానించబడి ఉంటుంది. దీని ద్వారా యాత్రికుల లొకేషన్‌ను కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షించవచ్చు. ముఖ్యంగా వృద్ధులు దారి తప్పిపోయినప్పుడు వారిని కనిపెట్టడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
మినాలో విలాసవంతమైన బస మినాలోని శిబిరాల్లో గతంలో ఉన్న నేల పరుపుల స్థానంలో, ఈసారి యాత్రికులకు సౌకర్యవంతమైన సోఫా-కమ్-బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న శిబిరాలు చెక్కతో చేసినవే అయినప్పటికీ, అవి పూర్తిగా అగ్నినిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
డిజిటల్ కనెక్టివిటీ: యాత్రికుల సౌకర్యార్థం ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించడంతో పాటు, రవాణా కోసం బస్సు సర్వీసులను కూడా భారీగా పెంచారు.
భద్రతకు పెద్దపీట:
యాత్రికుల ప్రయాణం సురక్షితంగా సాగాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు హజ్ ప్రతినిధులు వివరించారు. వంటపై నిషేధం ఉన్నందున యాత్రికులకు నాణ్యమైన ఆహార సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
టెక్నాలజీ, భద్రతను మేళవించి ఈ ఏడాది హజ్ యాత్రను మరింత సులభతరం చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

