Silver Ganesha Idol at Home: ఇంట్లో వెండి వినాయకుడి విగ్రహం ఉందా? సరైన దిశ, నిత్య పూజా విధానం ఇవే..
నిత్య పూజా విధానం ఇవే..

Silver Ganesha Idol at Home: హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యమైనా మొదట విఘ్నేశ్వరుడి పూజతోనే ప్రారంభమవుతుంది. సకల విఘ్నాలను తొలగించి, సిరిసంపదలను ప్రసాదించే గణపతిని వివిధ లోహాల రూపంలో ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా ఇంట్లో వెండితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఉంచి పూజించడం అత్యంత శుభప్రదమని వాస్తు శాస్త్రం, జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వెండి స్వచ్ఛతకు, ప్రశాంతతకు చిహ్నం కావడంతో పాటు లక్ష్మీదేవి కటాక్షాన్ని త్వరితగతిన ఆకర్షిస్తుంది. అయితే ఇంట్లో వెండి వినాయకుడిని ప్రతిష్టించేటప్పుడు కొన్ని ముఖ్యమైన వాస్తు సూత్రాలు, సరైన దిశ, పూజా నియమాలను తప్పక పాటించాలి.
వెండి వినాయకుడిని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు
వాస్తు దోష నివారణ: ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల తరంగాలు వెల్లివిరుస్తాయి.
ఆర్థిక స్థిరత్వం:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వెండి చంద్రుడు, శుక్ర గ్రహాలకు ప్రతీక. వెండి గణపతిని ఆరాధించడం వల్ల ఇంట్లో ధనధాన్యాల కొరత ఉండదు; అప్పుల బాధల నుండి ఉపశమనం లభిస్తుంది.
మానసిక ప్రశాంతత - విజయం ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి శాంతి, సామరస్యం నెలకొంటాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది.
వాస్తు ప్రకారం విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలి?
విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు దిశ ఎంతో ముఖ్యం. తప్పుడు స్థానంలో ఉంచితే ఆశించిన శుభ ఫలితాలు దక్కవు.
ఈశాన్య మూల : దేవతా విగ్రహాలను ఉంచడానికి ఈశాన్య దిశ అత్యుత్తమమైనది. వెండి వినాయకుడిని ఈశాన్యంలో లేదా ఉత్తర దిశ వైపు ముఖం ఉండేలా ప్రతిష్టించాలి.
ముఖం ఎటువైపు ఉండాలి?:
వినాయకుడి ముఖం ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉండటం అత్యంత శ్రేయస్కరం. ఉత్తర దిశ శివుడికి, కుబేరుడికి నిలయం కాబట్టి ఐశ్వర్యం చేకూరుతుంది.
ఎక్కడ పెట్టకూడదు?:
ప్రధాన ద్వారానికి వెనుక వైపు, మెట్ల కింద, బెడ్‌రూమ్‌లో లేదా బాత్రూమ్‌కు సమీపంలో ఎట్టిపరిస్థితుల్లోనూ విగ్రహాన్ని ఉంచకూడదు.
విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తొండం ఎటువైపు ఉండాలి?: గృహస్తులు పూజించే విగ్రహానికి తొండం ఎల్లప్పుడూ ఎడమ వైపునకు తిరిగి ఉండాలి. ఎడమవైపు తొండం ఉన్న గణపతిని పూజించడం వల్ల గృహంలో సుఖసంతోషాలు, ప్రశాంతత స్థిరంగా ఉంటాయి.
కూర్చున్న భంగిమ:
ఇంట్లో ఎల్లప్పుడూ కూర్చున్న భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే ఉంచాలి. నిలబడి ఉన్న విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచడం అంత మంచిది కాదు.
విగ్రహం పరిమాణం:
ఇంట్లో పూజించే విగ్రహం వేలి పరిమాణం లేదా గరిష్టంగా అరచేతి పరిమాణంలో ఉండటం ఉత్తమం.
నిత్య పూజా విధానం
గంగాజలంతో అభిషేకం: రోజూ ఉదయాన్నే విగ్రహాన్ని గంగాజలం లేదా శుభ్రమైన నీటితో శుద్ధి చేయాలి.
గంధం, కుంకుమ:
వినాయకుడికి ఎరుపు రంగు లేదా చందనం తిలకం దిద్దాలి.
గరిక - ఎరుపు పూలు స్వామివారికి గరిక ఎరుపు రంగు మందార పువ్వులు అంటే అత్యంత ప్రీతికరం. పూజలో వీటిని సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
నైవేద్యం:
బెల్లం, అరటిపండు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి, నెయ్యి దీపం వెలిగించి వినాయక అష్టోత్తరం లేదా సంకటనాశన స్తోత్రం పఠించాలి.
నియమనిష్ఠలతో వెండి వినాయకుడిని ఇంట్లో పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోయి, కుటుంబంలో శాశ్వత సౌభాగ్యం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని విశ్వాసం.

