వాల్మీకి మహర్షిగా ఎలా మారాడు?

Sage Valmiki: వాల్మీకి మహర్షి బాల్యంలో పేరు రత్నాకరుడు అని కొన్ని పురాణ కథనాలు తెలుపుతున్నాయి. ఈయన బోయవారి కుటుంబంలో పెరిగిన తరువాత, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఒకప్పుడు దారి దోపిడీలు చేసే వ్యక్తిగా ఉండేవారని చెబుతారు. నారద మహర్షి ఉపదేశంతో రత్నాకరుడు 'మరా' (మరణం) అనే పదాన్ని తపస్సులో జపిస్తుండగా అది క్రమంగా 'రామ' నామంగా మారింది. ఆయన ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేయగా, ఆయన చుట్టూ వల్మీకం (పుట్ట) నిర్మితమైంది. ఈ పుట్ట నుంచి బయటికి వచ్చినందున ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది. వాల్మీకి మహర్షి శ్రీరాముడికి సమకాలికుడిగా, ఆయన జీవితంలోని కీలక ఘట్టాలలో భాగమైనట్లు రామాయణం ద్వారా తెలుస్తుంది. శ్రీరాముడు సీతను వనవాసానికి పంపినప్పుడు, ఆమె వాల్మీకి ఆశ్రమంలోనే ఉంది. సీతాదేవికి పుట్టిన లవకుశులు వాల్మీకి ఆశ్రమంలోనే జన్మించి, పెరిగి పెద్దవారయ్యారు. వాల్మీకి మహర్షి వారికే మొట్టమొదటగా రామాయణంను బోధించారు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు జన్మించిన సమయాన్ని ఖచ్చితమైన ఖగోళ వివరాలతో (గ్రహాల స్థానాలు, తిథి, నక్షత్రాలు) సహా పేర్కొన్నారు. ఆధునిక సాఫ్ట్‌వేర్ల ద్వారా పరిశోధకులు ఈ వివరాలు క్రీ.పూ. 5114 జనవరి 10 న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖగోళ వివరాలను బట్టి వాల్మీకి గొప్ప కవి మాత్రమే కాక, అపారమైన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అని కూడా తెలుస్తోంది. వాల్మీకి రామాయణంలోని ప్రతి 1000వ శ్లోకం మొదటి అక్షరాన్ని కలిపితే, ఆ 24 అక్షరాలతో గాయత్రి మంత్రం ఏర్పడుతుందని చెబుతారు. ఇది రామాయణం అంతరార్థమే గాయత్రీ మంత్రమని సూచిస్తుంది. వాల్మీకి మహర్షి మహాభారత కాలంలో కూడా జీవించి ఉన్నారని, యుద్ధం తర్వాత ధర్మరాజును సందర్శించిన ఋషులలో ఆయన కూడా ఉన్నారని కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story